ఉదయగిరి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కావలి నుంచి సీతారామపురం వరకు 104.4 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి మంజూరైంది. దీని కోసం రూ.768 కోట్లు మంజూరయ్యాయి. రెండు భాగాలుగా విభజించారు. మొదటి ఫేజ్‌లో కావలి – దుత్తలూరు వరకు 69 కి.మీ. దూరం రోడ్డు విస్తరించేందుకు రూ.400 కోట్లు నిధులిచ్చారు. దీనికి సంబంధించి పనులు చేసే హక్కును టెండర్లలో ఓ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. 24 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొదటి గడుపు ప్రకారం పనులు 2024 సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలి. కానీ ఇంతవరకు పనులు చేయలేదు. ఏళ్ల తరబడి సాగుతున్నాయి. ప్రస్తుతం తుదిదశలో ఉన్నాయి.
అప్పుడే దెబ్బతింటూ..
రోడ్డు పనుల్లో నాణ్యత లోపించింది. ముందుగా వేసిన ప్రాంతాల్లో దెబ్బతింటోంది. పలుచోట్ల కుంగిపోతుంది. దీంతో కాంట్రాక్ట్ సంస్థ మరలా ఆ ప్రాంతంలో మరమ్మతులు చేపట్టింది. ఈ క్రమంలో రోడ్డు ప్యాచ్‌లుగా మారుతోంది. దుత్తలూరు – వింజమూరు మార్గంలో బ్రహ్మేశ్వరం వద్ద తాజాగా ప్యాచ్‌వర్క్‌లు చేస్తున్నారు. గతేడాది నుంచి ఈ మార్గంలో ప్యాచ్ పనులు జరుగుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేకుండా పనులు జరుగుతుంటే సంబంధింత కాంట్రాక్ట్ సంస్థపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
అధికలోడు ఇసుక టిప్పర్ల వల్లే..
కాగా నిర్మాణ సంస్థ మరోలా చెబుతోంది. పెన్నానది నుంచి ఇసుకను టిప్పర్లు ఓవర్‌లోడుతో తరలిస్తున్నాయి. అవి ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రోడ్డు దెబ్బతింటోంది. ఈ రహదారి కెపాసిటీ 25 టన్నులు. అంతకు రెట్టింపుగా ఇసుకలోడుతో టిప్పర్లు నడుస్తున్నాయని, దీనివల్లే సమస్య వస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. టిప్పర్లను నియంత్రించాల్సిన రవాణా శాఖాధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ మార్గంలో రోజూ 65 వరకు టిప్పర్లు ఓవర్‌లోడుతో వెళ్తున్నట్లు సమాచారం. ప్రతినెలా సంబంధిత అధికారులకు మామూళ్లు ఇస్తుండంతో వాటి జోలికి వెళ్లడం లేదు. మేము మాత్రం ఏమి చేయగలమని.. మమ్మిల్ని నిందిస్తే ఎలా అని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ఎన్‌హెచ్ 167 బీజీ రోడ్డు నాణ్యత డొల్ల
పూర్తికాక ముందే ప్యాచ్‌వర్క్‌లు
నాసిరకం పనులపై ప్రజల ఆందోళన
ఇసుక టిప్పర్ల వల్లే సమస్య అంటున్న నిర్మాణ సంస్థ
కావలి – దుత్తలూరు జాతీయ రహదారి (167 బీజీ) పనుల్లో నాణ్యత లోపించింది. ఎన్‌హెచ్ అధికారుల అలసత్వం..
కాంట్రాక్ట్ సంస్థ కక్కుర్తి వెరసి పనులు పూర్తికాక ముందే నాణ్యతలో డొల్లతనం బయటపడుతోంది. ఐదేళ్లపాటు పదిలంగా ఉండాల్సిన రోడ్డు ముణ్ణాళ్ల ముచ్చటగా మారింది. పనులు పూర్తికాక ముందే పగుళ్లు ఇవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


