ముత్తుకూరు(పొదలకూరు): ఉప్పు కాలువలో వేటాడుతూ జీవనం సాగించే గిరిజన కుటుంబాలు రేషన్ సరుకులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తమకు వెంటనే బియ్యం అందజేయాల్సిందిగా ముత్తుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చలివేంద్రం గిరిజనులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెలా సరుకులు సకాలంలో ఇవ్వరన్నారు. ఈనెలలో 12 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పంపిణీ చేయలేదన్నారు. కాలనీకి దూరంగా ఉన్న బలిజపాళెం గ్రామంలో రేషన్ పంపిణీ చేస్తామనడం అన్యాయమని మండిపడ్డారు. మహిళలు, వృద్ధులు అంత దూరం వెళ్లి సరుకులు ఎలా తెచ్చుకోవాలని ప్రశ్నించారు. వారం రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. గ్రామంలో 70 గిరిజన కుటుంబాలున్నాయి. 350 కార్డులుండగా ప్రత్యేకంగా రేషన్‌షాపు లేదు. ముత్తుకూరు నుంచి వచ్చే డీలర్ వారికి ప్రతినెలా సరుకులను అందజేయాలి. స్థానిక తుపాన్ షెల్టర్లో సరుకులను తోలి అందజేస్తుంటారు. అయితే షెల్టర్‌లో పోర్టు వారు ఇసుక తదితర సామగ్రి తోలడంతో ఆ అవకాశం కూడా లేకుండాపోయింది. గతంలో ఇంటింటికీ వచ్చి రేషన్ సరుకులను అందజేసేవారని, ఇప్పుడు తమకు అవస్థలు తప్పడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.
ఏపీ మోడల్ ప్రవేశపరీక్షకు 299 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): ఏపీ మోడల్ స్కూళ్లలో ప్రవేశం కోసం ఆదివారం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా పరీక్ష జరిగింది. 11 మోడల్ స్కూళ్లలో పరీక్షను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. 1,067 మంది విద్యార్థులకు గానూ 768 మంది హాజరయ్యారు. 299 మంది గైర్హాజరయ్యారు. ఫలితాలు ఈనెల 27వ తేదీన విడుదల చేస్తారు. 30న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా స్కూళ్లలో సీట్లు కేటాయించనున్నారు.


