సైదాపురం: మండలంలోని కృష్ణారెడ్డిపల్లి గ్రామంలో వైకుంఠపురంలో ఉన్న మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి ఆలయ వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మహావిష్ణువు ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై ఊరేగించారు.ఉదయం స్వామి మోహినీ అలంకరణలో దర్శనమిచ్చారు. మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. పిల్లలు వెంకటేశ్వరస్వామి వేషధారణలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. గరుడోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
పేకాట స్థావరంపై దాడి
కొండాపురం: మండల కేంద్రమైన కొండాపురం శివారు ప్రాంతంలోని కోమటిరెడ్డి చంద్రశేఖర్‌కు చెందిన ఓపెన్ షెడ్ వద్ద పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎస్సై మాల్యాద్రి తన సిబ్బందితో ఆదివారం సాయ ంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.14,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై తెలిపారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
చిల్లకూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం జాతీయ రహదారిపై చిల్లకూరు బైపాస్ వద్ద చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. గూడూరు మండలం పోటుపాళేనికి చెందిన మద్దూరు అంకయ్య (55) పని నిమిత్తం మోపెడ్‌పై గూడూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో అతను జాతీయ రహదారి దాటుతున్న సమయంలో నాయుడుపేట వైపు నుంచి నెల్లూరు వైపునకు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో అంకయ్యకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని అంకయ్య మృతిని నిర్ధారించారు. దీంతో పోలీసులు లారీని స్వాధీ నం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


