● మత్స్యశాఖ అధికారులకు
కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశం
● కొత్త బోటు కొనుగోలుకు నిధులు మంజూరు
● మరో బోటును అద్దెకు ఏర్పాటు చేయాలని సూచన
నెల్లూరు (దర్గామిట్ట): జిల్లా పరిధిలోని సముద్ర జలాల్లో మత్స్యకారుల భద్రతకు, తమిళ జాలర్లు ఆగడాలను అరికట్టేందుకు సముద్ర తీరంలో గస్తీని ముమ్మరం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 450 హెచ్‌పీ సామర్థ్యం గల హైస్పీడ్ బోటును తక్షణమే కొనుగోలు చేయాలని మత్స్యశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివా రం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మత్స్యశాఖ అధికారులు, తీర ప్రాంతంలోని 9 మండలాల తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రెండు బోట్లతో గస్తీ నిర్వహిస్తున్నాయని, వీటిని హైస్పీడ్ బోట్స్‌గా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. కొత్త బోటులో వీడియో రికార్డింగ్ సదుపాయం కలిగిన రెండు బైనాక్యూలర్లు, అధిక సామర్థ్యం గల తాళ్లు, అగ్నిమాపక నిరోధక సిలిండర్లు, రెండు ఫ్లాష్ లైట్లు, రెండు మెడికల్ కిట్లు వంటి అవసరమైన అన్ని భద్రతా పరికరాలను వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొత్త హైస్పీడ్ బోట్ వచ్చే వరకు ఒక హైస్పీడ్ బోట్‌ను అద్దెకు రెండు రోజుల్లోపు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ శాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ చాంద్‌బాషా పాల్గొన్నారు.


