కొత్త నియోజకవర్గాల విభజనపై ఊహాగానాలు, చర్చలు | - | Sakshi
Sakshi News home page

కొత్త నియోజకవర్గాల విభజనపై ఊహాగానాలు, చర్చలు

Mar 25 2026 6:59 AM | Updated on Mar 25 2026 6:59 AM

ప్రస్తుతం నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాలను నెల్లూరు నగరంలోని జనాభా, ఓట్ల ప్రకారం విభజన చేస్తే.. నెల్లూరు సౌత్‌, నెల్లూరు సెంట్రల్‌, నెల్లూరు నార్త్‌ నియోజకవర్గాలుగా విభజన జరిగే అవకాశం ఉంటుందని ఊహాగాలు ఉన్నాయి.

అల్లూరు, బోగోలు, దగదర్తి, విడవలూరుతో కలిపి అల్లూరు నియోజకవర్గం.

రాపూరు, కలువాయి, సైదాపురం, పొదలకూరుతో రాపూరు నియోజకవర్గం.

బుచ్చిరెడ్డిపాళెం, సంగం, ఏఎస్‌పేటతో కలిపి బుచ్చిరెడ్డిపాళెం నియోజకవర్గం.

కోవూరు, కొడవలూరు, ఇందుకూరుపేటతో కోవూరు నియోజకవర్గం.

కావలి పట్టణం ఒక నియోజకవర్గంగా, కావలి మండలం, జలదంకి, కలిగిరి, కొండాపురంతో కావలి రూరల్‌ నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం. కానీ పక్షంలో కావలి పట్టణం, మండలం ఒక నియోజకవర్గంగానే రూపొందించే పరిస్థితి ఉంటుంది

వింజమూరు, జలదంకి, కలిగిరి, కొండాపురంతో వింజమూరు నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది.

ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం, చేజర్లతో కలిసి ఆత్మకూరు నియోజకవర్గంగా మారే పరిస్థితి ఉంది.

గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు గూడూరు నియోజకవర్గం ఏర్పడుతుందని అంచనాలు

నాయుడుపేట, చిట్టమూరు, ఓజిలి, పెళ్లకూరుతో కలిపి నాయుడుపేట నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం.

వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లితో కలిపి వెంకటగిరి నియోజకవర్గం.

సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడతో కలిపి సూళ్లూరుపేట నియోజకవర్గం ఏర్పడే అవకాశం.

ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, సీతారామపురంతో కలిసి ఉదయగిరి నియోజకవర్గం ఉండే అవకాశం.

వెంకటాచలం, మనుబోలు, తోటపల్లిగూడూరు, ముత్తుకూరుతో కలిసి సర్వేపల్లి నియోజవర్గ విభజన జరిగే పరిస్థితి.

లోక్‌సభ, శాసన సభల నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సీట్ల సంగ్రామం ప్రారంభమైంది. కేంద్రం ప్రతిపాదనల మేరకు జిల్లాలో ప్రస్తుతం ఉన్న స్థానాల్లో 50 శాతం మేర అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలు పెరగనున్నాయి. తాజా నిర్ణయాల మేరకు కొత్తగా వచ్చే నియోజకవర్గాల రూపకల్పనపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఏఏ మండలాలతో కొత్త నియోజకవర్గాలు వస్తాయో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. పునర్విభజన జరిగితే.. 15 అసెంబ్లీ, మూడు పార్లమెంట్‌ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్‌ అమలు చేసే క్రమంలో ఐదు అసెంబ్లీ సీట్లు కచ్చితంగా మహిళలకు దక్కుతాయి.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన షురూ కావడంతో చట్ట సభల్లోకి అడుగు పెట్టాలనే ఆశావహుల్లో ఆనందం వెల్లివిరిసింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే నియోజకవర్గాల పునర్విభజన, కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నప్పటికీ 2021లో జనగణన జరగకపోవడంతో ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. 2026–27 మధ్య జనగణన పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ మేరకు 2029 ఎన్నికల నాటికి మారుతాయంటూ అంచనాల్లో ఉన్నారు. అయితే ఊహించని విధంగా 2011 జనాభా ప్రాతిపదికనే ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 50 శాతం స్థానాలు పెరిగే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్నాళ్లు గానో ఊహలు, అంచనాల్లో ఉన్న ఈ ప్రక్రియకు లైన్‌ క్లియర్‌ కావడంతో రాజకీయ పార్టీల్లోని ఆశావహుల్లో ఆశలు చిగురించాయి.

ఐదు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానాల పెంపు

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌, కావలి, సర్వేపల్లి, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి, గూడూ రు, సూళ్లూరుపేట నియోజకవర్గాలున్నాయి. జిల్లాలోని అసెంబ్లీ స్థానాలతో కలిపి నెల్లూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలతో కలుపుకొని తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో గూడూరు, సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానాలు, తిరుపతి పార్లమెంట్‌ ఎస్పీ రిజర్వ్‌ స్థానాలుగా ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రతిపాదనల మేరకు ఒక్కో నియోజకవర్గానికి 1.6 లక్షల ఓటర్ల లెక్కన విభజన చేస్తే కొత్తగా మరో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు.. మరో పార్లమెంట్‌ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. మొత్తంగా 15 అసెంబ్లీ స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ సీట్లు ఏ ప్రామాణికంగా విభజన చేస్తారోనని ఉత్కంఠ అందరిలో నెలకొంది.

ఉమ్మడి నెల్లూరులోనే

రెండు పార్లమెంట్‌ స్థానాలు

ఇప్పటి వరకు నెల్లూరు పార్లమెంట్‌ జనరల్‌గా ఉంది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌, ఆత్మకూరు, కోవూరు, కావలి, ఉదయగిరితోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరుతో కలిపి నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గంగా ఉంది. ఇక ఉమ్మడి జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి తిరుపతి ఎస్సీ రిజర్వుడ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంగా ఉంది. తాజాగా పెరిగే నియోజకవర్గాలతో కలుపుకొంటే.. నెల్లూరు (జనరల్‌) పార్లమెంట్‌తోపాటు గూడూరు (ఎస్సీ రిజర్వ్‌) పార్లమెంట్‌ నియోజకవర్గం కూడా ఏర్పడే అవకాశం ఉంది.

ఐదు అసెంబ్లీ స్థానాలు మహిళలకే

ఉమ్మడి నెల్లూరులో కొత్తగా 5 అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. ఐదు స్థానాలు మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ప్రకారం కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో గూడూరు, సూళ్లూరుపేట ఎస్పీ రిజర్వ్‌డ్‌ స్థానాలుగా ఉన్నాయి. మిగతా ఎనిమిది జనరల్‌ స్థానాలు కావడంతో ఈ స్థానాల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంది. తాజాగా ఐదు స్థానాలు పెరిగితే.. మొత్తం స్థానాల్లో ఐదు కేవలం మహిళలకే రిజర్వ్‌ చేయాల్సి ఉంటుంది.

కేంద్ర తాజా నిర్ణయంతో

ఆశావహుల్లో ఆనందం

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఐదు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ సీట్ల పెరుగుదల

కొత్త నియోజకవర్గాల రూపకల్పనపై రకరకాల అంచనాలు

ఏ మండలం ఏ నియోజకవర్గంలోకి వస్తుంది.. కొత్తగా వచ్చే

నియోజకవర్గాలపై చర్చలు

33 శాతం మహిళా రిజర్వేషన్‌తో ఐదు అసెంబ్లీ సీట్లు మహిళలకే

1.6 లక్షల ఓటర్లకు ఒక నియోజకవర్గంగా విభజన చేస్తే జిల్లాలో కొత్త నియోజకవర్గాల పునర్విభజన ఇలా జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గా ల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న పాత నియోజకవర్గాల సరిహద్దులు సమూలంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పాత అల్లూరు, రాపూరుతోపాటు కొత్తగా నెల్లూరు నగరంలో ఒకటి, బుచ్చిరెడ్డిపాళెం, నాయుడుపేట, కావలి రూరల్‌, వింజమూరు కేంద్రాలుగా వీటిల్లో కొత్తగా మూడు నియోజకవర్గాలు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాల్లో ఊహాల ఊసులు ఊపందుకున్నాయి. నెల్లూరు సౌత్‌, నార్త్‌, సెంట్రల్‌, కోవూరు, అల్లూరు, కావలి, వింజమూరు, ఉదయగిరి, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, సర్వేపల్లి, గూడూరు, రాపూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట నియోజకవర్గాలుగా ఏర్పడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement