నెల్లూరు సిటీ: నెల్లూరు–2 డిపోను ఓ ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టాలని చూడడం దుర్మార్గమని, ఈ ప్రయత్నాన్ని వెనక్కు తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కె.ప్రసాద్ డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్టీసీ 2–డిపో వద్ద శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. డిపోలో పనిచేసే వారిని మరో డిపోలకు తరలించే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా ప్రైవేటీకరణను విరమించుకోకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ యూనియన్ జాయింట్ సెక్రటరీ రమణారావు, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారావు, ఎన్‌ఎంయూఏ కార్యదర్శి సునీల్ తదితరులు పాల్గొన్నారు.


