చేజర్ల: పాముకాటుకు గురై గీత కార్మికుడు మృతిచెందిన ఘటన శనివారం చేజర్ల మండలం చీర్లవారికండ్రిక వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన పర్చూరు కృష్ణయ్య (55) రోజులానే గ్రామం దగ్గరలోని చీర్లవారికండ్రికకు వెళ్లి తాటిచెట్టు ఎక్కి కళ్లు కుండలు దింపి తిరుగు ప్రయాణంలో పాముకాటు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించేలోపు మార్గమధ్యలో మృతిచెందారు. ఇంటి పెద్ద కృష్ణయ్య మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన యువకులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన విషాదం మిగల్చగా, పర్చూరి కృష్ణయ్య మృతితో గ్రామంలో మరింత విషాదఛాయలు అలుమున్నాయి.
24న క్యాంపస్ డ్రైవ్
కోవూరు: గంగవరంలోని గీతాంజలి పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 24వ తేదీ భారీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం.మహేంద్రబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఉన్నత విద్యాశాఖ సహకారంతో చైన్నెకి చెందిన ఓ ప్రముఖ సంస్థ ఎంపికలు చేపట్టనుందన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రస్తుతం మూడో సంవత్సరం (ఫైనలియర్) చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థులందరూ హాజరుకావచ్చన్నారు.


