అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన
● వీఎస్‌యూ వీసీ
శ్రీనివాసరావు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ(వీఎస్‌యూ), అంతర్జాతీయ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య, పరిశోధన, శిక్షణ లభిస్తాయని వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వీఎస్‌యూలో యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ మిషన్ గ్రూప్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ(ఏపీయూఎన్‌ఏ), అంతర్ ప్రభుత్వ సంస్థల (ఐజీఓ) ద్వారా అనుబంధంగా ఉన్న యూఎన్‌ఏ గ్రూప్ సంస్థలతో వీఎస్‌యూ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) శనివారం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సామాజిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు, అంతర్జాతీయ సంబంధాలపై సంయుక్త వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, ఇంటర్న్‌షిప్‌లు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల్లో గ్లోబల్ అవగాహన, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మాస్కో(రష్యా)లోని ఐసీఎస్‌టీఐ చీఫ్ ఎక్స్‌పర్ట్ అండ్ యునైటెడ్ నేషన్స్ విజన్ డిప్లోమాట్ జయ రాములు లింగుట్ల మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం విద్యారంగంలో ఒక మైలురాయి అని పేర్కొన్నారు. ఐసీఎస్‌టీఐ సహకారంతో అంతర్జాతీయ సెమినార్‌లు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. వీఎస్‌యూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయని, అధ్యాపకులు అంతర్జాతీయ సంస్థలతో కలిసి సంయుక్త పరిశోధనలు చేయవచ్చని వెల్లడించారు.


