ఎస్‌ఈఐఎల్ ఎనర్జీకు విశిష్ట గుర్తింపు
ముత్తుకూరు(పొదలకూరు) : ముత్తుకూరు మండలంలోని ఎస్‌ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌కు విశిష్ట గుర్తింపు లభించింది. 2025–26 సంవత్సరానికి ప్రతిష్టాత్మక గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికెట్ లభించినట్లుగా ఆ కంపెనీ శుక్రవారం ప్రకటించింది. కంపెనీపై నిర్వహించే సర్వేలో ఉద్యోగులు వ్యక్తపరిచే అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకుని గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికెట్‌ను అందజేస్తారు. ఈ ఏడాది 86 శాతం మంది ఉద్యోగులు ఎస్‌ఈఐఎల్‌లో పనిచేయడంపై సదాభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లుగా కంపెనీ సీఈఓ జనమేజయ మహాపాత్ర వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది విశిష్ట గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికెట్ సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి సర్టిఫికెట్ కలిగిన కంపెనీల్లో చేరేందుకు 93 శాతం మంది ఆసక్తి చూపుతారని, న్యాయంగా జీతం, కంపెనీ లాభాల్లో వాటా, ఉద్యోగోన్నతి పొందే అవకాశాలు లభిస్తాయన్నారు.
నేటి నుంచి జిల్లాస్థాయి
లీప్ క్రికెట్, త్రోబాల్ పోటీలు
నెల్లూరు (టౌన్): పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లీప్ క్రికెట్, త్రోబాల్ పోటీలను శనివారం నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని డైట్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. డివిజనల్ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు.
రుస్తుం మైనింగ్ కేసులో
ఏ–2 అరెస్ట్
పొదలకూరు: మండలంలోని తాటిపర్తిలో ఉన్న రుస్తుం అక్రమ మైనింగ్ కేసులో ఏ–2 నిందితుడిగా ఉన్న పొదలకూరుకు చెందిన వాకాటి శివారెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రుస్తుం మైన్‌లో అక్రమంగా మైనింగ్ చేశారని ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా కేసులో పేర్లను చేర్చుకుంటూ మొత్తం 13 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా శివారెడ్డిను నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వకుండా పోలీసులు అడ్డుపడుతూ వచ్చారు. కాగా ఇదే కేసులో ఏ–5 నిందితుడు ఇంత వరకు ముందుస్తు బెయిల్ తెచ్చుకోలేదు. కానీ ఆయన పోలీసుల మధ్యనే తిరుగుతున్నా అతన్ని అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.
నేడు జిల్లా స్థాయి
విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
నెల్లూరు (టౌన్): జిల్లా స్థాయి దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం నిర్వహించనున్నారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థలో ఉదయం 9 గంటలకు ప్రదర్శన ప్రారంభం కానుంది. విద్యా వైజ్ఞానిక సదస్సులో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి 114 ప్రాజెక్ట్‌లను ప్రదర్శించనున్నారు. వ్యక్తిగత, గ్రూపు, టీచర్స్ విభాగాల్లో ప్రదర్శన ఉంటుంది. ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన గ్రూపు విభాగంలో–7, టీచర్స్ విభాగంలో–2, విద్యార్థి విభాగంలో–2 చొప్పున మొత్తం 11 ప్రాజెక్ట్‌లను రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక చేయనున్నారు. రాష్ట్రస్థాయి ప్రదర్శన ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలోని మురళి రిసార్ట్స్‌లో నిర్వహించనున్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 66,389 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 24,956 మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
ఎస్‌ఈఐఎల్ ఎనర్జీకు విశిష్ట గుర్తింపు


