పెట్రోల్, డీజిల్ కల్తీపై ప్రజల ఆగ్రహం
అల్లూరు: మండలంలోని అల్లూరు హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్, డీజిల్ కల్తీమయమైందంటూ ప్రజలు శుక్రవారం ఆందోళనకు దిగారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ చేశారు. ప్లకార్డులు, డీజిల్, పెట్రోల్ బాటిళ్లతో తమ వాహనాలను వెంటబెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ వద్ద బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డీటీ ప్రవీణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడుతూ హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో వారం క్రితం మూడు ట్రాక్టర్లకు రూ.22 వేలకు డీజిల్ పట్టించామన్నారు. సాయంత్రానికి వాహనాలు ఆగిపోయినట్లు చెప్పారు. మెకానిక్‌ను పిలిపించి చూపించగా డీజిల్లో నీరు కలిసిందని చెప్పారన్నారు. వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బందిని అడగ్గా వారు పరిశీలించి ట్యాంక్‌లో నీరు కలిసినట్లు చెప్పారని వెల్లడించారు. ట్రాక్టర్ల రిపేర్ ఖర్చు తాము భరిస్తామని చెప్పడంతో తాను మరమ్మతులు చేయించానన్నారు. తర్వాత బిల్లులను బంక్ సిబ్బందికి ఇవ్వగా మాకు ఎలాంటి సంబంధం లేదని నిర్లక్ష్యంగా అవమానిస్తూ మాట్లాడినట్లు వాపోయారు. అప్పు చేసి ట్రాక్టర్లను రిపేర్ చేయించినట్లు చెప్పారు. చాలామంది వాహనాలు దెబ్బతిన్నాయన్నారు. కార్యక్రమంలో పలువురు బాధితులు, అల్లూరు ట్రాక్టర్స్, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ కల్తీపై ప్రజల ఆగ్రహం


