‘సంక్షేమ పునాది’ని విజయవంతం చేయండి
● జిల్లా బీసీ వెల్ఫేర్
అధికారిణి వెంకటసుబ్బమ్మ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు చదువులో రాణించేందుకు ‘సంక్షేమ పునాది’ కార్యక్రమాన్ని రూపొందించారని, అధికారులు దీనిని విజయవంతం చేయాలని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి వెంకటసుబ్బమ్మ అన్నారు. నగరంలోని శోధన నగర్‌లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో శుక్రవారం ప్రత్యేక ట్యూటర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు చదువులో రాణించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పునాది కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఉండే భయాన్ని పోగొట్టి చదువుపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరికీ తెలుగు, ఇంగ్లిష్, గణితం వంటి సబ్జెక్ట్‌ల్లోని సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తారన్నారు. పాఠశాలల్లో రోజువారీ పాఠ్యాంశాలనే హాస్టల్‌కు వచ్చిన తర్వాత చదవడం, రాయడం అలవాటు చేస్తే మంచి పునాది ఏర్పడుతుందన్నారు. 10వ తరగతి విద్యార్థులెవరూ ఫెయిల్ కాకుండా వార్డెన్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ట్యూటర్లతోపాటు అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.


