రెండు చుక్కలతో నిండు జీవితం | - | Sakshi
Sakshi News home page

రెండు చుక్కలతో నిండు జీవితం

Dec 20 2025 9:23 AM | Updated on Dec 20 2025 9:23 AM

రెండు చుక్కలతో నిండు జీవితం

రెండు చుక్కలతో నిండు జీవితం

రేపు జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమం

2,94,604 మంది చిన్నారులు

8 వేల మంది సిబ్బంది నియామకం

నెల్లూరు(అర్బన్‌): ఒకప్పుడు జిల్లాలో ప్రతి సంవత్సరం పోలియో (శిశు పక్షవాతం) కేసులు నమోదయ్యేవి. ఆ బిడ్డలు జీవితాంతం కాలు చచ్చుబడి అవిటివారిగా ఉండేవారు. వారిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లేవారు. ఆ బాధ వర్ణనాతీతం. ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో దేశంతోపాటు జిల్లాలో మూడు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పల్స్‌పోలియో కార్యక్రమం జరుగుతోంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు పిల్లల నిండైన జీవితానికి రెండు చుక్కల మందు ఎంతో కీలకం. ఈనెల 21వ తేదీ ఆదివారం జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమం వైద్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది.

మూడు రోజులు..

జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల సమన్వయంతో మూడురోజులపాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వైద్యశాఖ సర్వే ద్వారా 0 నుంచి 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు 2,94,604 మంది ఉన్నారు. వీరిలో 2,749 మందికి వారు నివసించే ప్రాంతం, అనారోగ్య పరిస్థితులను బట్టి పోలియో సోకే అవకాశాలున్నట్టు గుర్తించారు. చుక్కల మందు వేయడానికి ఆదివారం 2,396 పోలియో చుక్కల బూత్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కోచోట నలుగురు సిబ్బంది ఉంటారు. పారామెడికల్‌ సిబ్బందితోపాటు అంగన్‌వాడీ, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 100 శాతం మందికి చుక్కల మందు వేస్తారు.

403 హైరిస్క్‌ ప్రాంతాల్లో..

ఇటుక బట్టీలు, ఊరికి దూరంగా కాల్వ గట్లపై నివాసముండే ఎస్టీ తెగలు, వలస కార్మికులు, సంచార జాతులు వంటి హైరిస్క్‌ ఉన్నవారికి అవగాహన లేకపోవడంతో పోలియో చుక్కలను తమ బిడ్డలకు వేయించడం లేదు. ఇలాంటి వారి కోసం జిల్లా వైద్యశాఖ 403 హైరిస్క్‌ ప్రాంతాలను గుర్తించింది. 82 మొబైల్‌ బూత్‌ల ద్వారా వీరందరితోపాటు ఆర్టీసీ, రైల్వే స్టేషన్‌, ఆత్మకూరు బస్టాండ్‌ లాంటి రద్దీ ప్రాంతాల్లో ప్రతి చిన్నారికి చుక్కలు వేస్తారు. వేరే జిల్లా వారు నెల్లూరు ప్రాంతం మీదుగా వెళ్తున్నా గుర్తించి మందు వేస్తారు. ఇందు కోసం అన్ని శాఖలతో కలిపి 8 వేల మంది సిబ్బందిని నియమించారు.

4.20 లక్షల డోసులు

జిల్లాకు 4,20,000 డోసుల వ్యాక్సిన్‌ వచ్చింది. 52 పీహెచ్‌సీలు, 10 పీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలో బోధనాస్పత్రి (పెద్దాస్పత్రి)కి వ్యాక్సిన్‌ను 538 హెచ్‌ఆర్‌ పాయింట్‌ల ద్వారా సరఫరా చేశారు. ఆదివారం పోలియో బూత్‌ల ద్వారా వ్యాక్సిన్‌ వేసిన సిబ్బంది ఆ బిడ్డల గోర్లకు సిరా గుర్తు పెడ్తారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ప్రతి ఇల్లూ తిరుగుతూ మంగళ, బుధవారాల్లో వ్యాక్సిన్‌ వేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement