క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): ‘క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయం. ప్రతిఒక్కరూ ఐక్యత, ప్రేమ, దయతో జీవించడమే వాటి సారాంశం’ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్ని శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ క్రిస్మస్ ప్రేమ, కరుణ, త్యాగం, మానవసేవకు ప్రతీక అన్నారు. బిషప్ మోస్ట్ రెవ. పిల్లి ఆంథోని దాస్ మాట్లాడుతూ ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తూ పరోపకారం చేయడం క్రీస్తుపై ఉన్న నమ్మకానికి నిదర్శమని చెప్పారు. తొలుత క్రిస్మస్ ట్రీని ఆవిష్కరించి కలెక్టర్, పాస్టర్లు వేడుకలను ప్రారంభించారు. అనంతరం పలువురు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పలువురు పాస్టర్ల విజ్ఞప్తి మేరకు నెల్లూరులో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి, పాస్టర్లకు గౌరవ వేతనం మంజూరు మొదలైన అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో డీఆర్వో విజయకుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ రఘు, వివిధ సంఘాల పాస్టర్లు దయాసాగర్, ఎలీషా కుమార్, సురేంద్రబాబు, శోభన్‌బాబు, బర్నబాస్, ఉదయ్ కుమార్, స్టీఫెన్, డేనియల్, హనోక్ తదితరులు పాల్గొన్నారు.


