పల్లెలో పట్టణ స్థాయి వసతులు
కందుకూరు మండల కేంద్రానికి 7 కిలో మీటర్ల దూరంలో ఉండే కోవూరు గ్రామం పక్కా పల్లెటూరు. ఆ ఊరుకు సరైన రోడ్డు వసతి లేదు. మట్టి రోడ్డు, అడుగడుగునా గుంతలు పడి వాహనదారులు ఇబ్బంది పడేవారు. గ్రామంలో అంతర్గత రోడ్లు చూస్తే.. మట్టి రోడ్లే. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఆ గ్రామ రూపురేఖలు మారిపోయాయి. రూ.7.09 కోట్లతో పట్టణ స్థాయి వసతులు కల్పించారు. కందుకూరు నుంచి కోవూరు వరకు రూ.1.58 కోట్లతో బీటీ రోడ్డు ఏర్పాటుతో ఏళ్ల కళ సాకారమైంది. రూ.1.32 కోట్లతో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ సెంటర్ భవనాలను నిర్మించారు. ఈ నాలుగు భవనాల నిర్మాణంతో గ్రామానికే ఒక కళ వచ్చింది. రూ.48 లక్షలతో జల్‌జీవన్ మిషన్ కింద ఇంటింటికి మంచినీ కొళాయిలు ఏర్పాటు చేశారు. రూ.6 లక్షలతో గ్రామంలోని మెయిన్ రోడ్డు మరమ్మతులు చేపట్టారు.
పచ్చని పంటలు.. సకల సౌకర్యాలు
వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో ఆ ఊరు రూపురేఖలే మారాయి. ఊరి పక్కనే ఉన్న పందివాగు నుంచి వర్షపు నీరంతా సముద్రానికి వెళ్లేది. రూ.2.70 కోట్లతో వాగుపై 316.8 క్యూసెక్కుల నీటి నిల్వ సామర్థ్యంతో చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టారు. దీంతో సుమారు 300 ఎకరాలు మెట్ట భూమిలో ఎప్పుడూ పచ్చని పైర్లతో ఆ ఊరికే సిరిసంపదలు తెచ్చి పెడుతున్నాయి. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు, రూ.35 లక్షలతో ఓపెన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కమ్యూనిటీ భవనాలకు మరమ్మతులు చేపట్టి ఆధునిక వసతులు కల్పించారు. రూ.13 లక్షలు వెచ్చించి భూమి కొనుగోలు చేసి ఇళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పంచాయతీకి సంపద సృష్టించేందుకు ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డును నిర్మించారు. ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త సేకరణకు బుట్టలు పంపిణీ చేశారు. చెత్త సేకరించేందుకు గ్రీన్ అంబాసిడర్‌ను నియమించి చెత్త వాహనాల ద్వారా చెత్తను సేకరించి తరలిస్తున్నారు. గ్రామంలో నూతన భవనాలు, ఉద్యోగులతో గ్రామం కళకళలాడుతోంది. ఏడున్నర దశాబ్దాల కాలంలో జరగని అభివృద్ధి.. జగనన్న ఐదేళ్ల పాలనలో జరిగిందని సర్పంచ్ ఆవుల మాధవరావు చెప్పారు.
పల్లెలో పట్టణ స్థాయి వసతులు


