హౌసింగ్ పీడీ రిలీవ్
నెల్లూరు(అర్బన్): జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టీ వేణుగోపాల్‌ను బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి పోస్టింగ్ కోసం విజయవాడలోని ఆ శాఖ ఎండీకి రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎఫ్‌ఏసీ పీడీగా ఏపీ టిడ్కో ఈఈ మహేష్‌ను నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో హౌసింగ్ కార్పొరేషన్‌లో అనేక అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా పీడీగా నియమితులైన వేణుగోపాల్ పరిస్థితులు చక్కదిద్దకపోవడంతో పాటు అక్రమార్కులకు అండగా ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కలెక్టర్ ఆయన్ను రిలీవ్ చేసినట్లుగా సమాచారం.
ఏపీపీగా
చదలవాడ రాజేష్
నెల్లూరు(లీగల్): నెల్లూరు నాల్గో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది చదలవాడ రాజేష్‌ను నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. ఆయన ఏపీపీగా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
కారుణ్య నియామక పత్రాల అందజేత
నెల్లూరు(దర్గామిట్ట): వివిధ శాఖల్లో విధి నిర్వహణలో ఉంటూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం తన ఛాంబర్‌లో కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. పశు సంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తూ మరణించిన జే వెంకటరావు భార్య జీ భాగ్యమ్మకు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కుక్‌గా కారుణ్య నియామకపత్రం అందజేశారు. అలాగే ఏపీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ మరణించిన టీ రాఘవయ్య కుమారుడు టీ పవన్‌కు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా కారుణ్య నియామకపత్రం అందజేశారు.
హౌసింగ్ పీడీ రిలీవ్


