సోమిరెడ్డీ.. సీబీఐ విచారణకు సిద్ధమా?
● తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: ‘ఇరిగేషన్ పనుల్లో అవినీతిపై నేను సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నా. సోమిరెడ్డి సిద్ధమా’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని ఇడిమేపల్లి, పలుకూరువారిపాళెం గ్రామాల్లో గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటించారు. నీటమునిగిన నారుమడులను చూపి తాము నష్టపోయామని, అధికారులెవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. గ్రామ పరిధిలోని చెరువు కట్ట మరమ్మతులను రైతులందరూ కలిసి చేయిస్తే వాటి బిల్లులను టీడీపీ నాయకులు చేసుకున్నారని వాపోయారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పాలనలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే సాయం అందించినట్లు గుర్తు చేశారు. పంట నష్టం జరిగితే వెంటనే పరిహారం ఇవ్వడం, నారుమళ్లు దెబ్బతింటే సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసి అండగా నిలిచినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం వారిని పట్టించుకునే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు.
అవినీతి సంపాదనపైనే ధ్యాస
సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకుని సోమిరెడ్డి ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారని కాకాణి ఆరోపించారు. ఆయనకు అవినీతి సంపాదనపై ఉన్న ధ్యాస, ప్రజల సమస్యలపై లేదని ధ్వజమెత్తారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మొక్కుబడిగా పర్యటించి, ఫొటోలకు పోజులిచ్చి వెళ్లడం తప్ప, ప్రజల సమస్యలను ఎక్కడా పరిష్కరించడం లేదన్నారు. అక్రమంగా గ్రావెల్ తరలింపు, ఇరిగేషన్ పనులు కొన్నిచోట్ల చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతి గురించి ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కాకుటూరు శివాలయ భూములను లేఅవుట్ యజమానులకు అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన పనులు, కూటమి పాలనలో జరిగిన పనులు, సోమిరెడ్డి దొంగ బిల్లులపై రైతుల సమక్షంలోనే చర్చించడానికి రావాలని సవాల్ విసిరారు.


