టీడీపీ పాలనలో అరాచక రాజ్యం
● గడిచిన ఏడాదిన్నరలో జిల్లాలో 30 హత్యలు
● నేరాలకు పాల్పడే వారిపై కఠిన చట్టాలు
అమలు చేయాలి
● ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి,
మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు: రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో మాఫియా గ్యాంగ్‌లు, రౌడీషీటర్లు, గంజాయి గూండాలు చెలరేగిపోతున్నారని.. బెల్టు షాపులు, నకిలీ మద్యం విలయతాండవం చేస్తున్నాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా నియోజకవర్గంలో సేకరించిన 60 వేల సంతకాల పత్రాలను నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయానికి పార్టీ మండలాధ్యక్షుడు అత్తిపల్లి అనూప్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. రాజకీయ కారణాలతో గంజాయి విక్రేతలపై పోలీసులు చర్యలు చేపట్టడంలేదని చెప్పారు. జిల్లాలో గంజాయి ముఠా సభ్యులు 300 మంది వరకు ఉంటారని, వీరిని అణిచేస్తే సమస్యను పరిష్కరించొచ్చని తెలిపారు. అయితే ఈ విషయాన్ని విస్మరించి.. ప్రతిపక్ష పార్టీ నేతలపై గంజాయి కేసులు పెడుతుండటంతో సమస్య తీవ్రమవుతోందని చెప్పారు. రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుడితే కోటిన్నర మేర పూర్తి చేశామని వెల్లడించారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో పార్టీలకతీతంగా పలువురు సంతకాలు చేశారని వివరించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం
శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. హత్యలకు పాల్పడిన వారు జైళ్లలో రాజభోగాలను అనుభవిస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిన్నరలో జిల్లాలో 30 మందిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారని ఆరోపించారు. గంజాయి వ్యాపారం వద్దన్నందుకే సీపీఎం నేత పెంచలయ్యను మాఫియా హతమార్చిందని చెప్పారు. శిక్షలు కఠినంగా ఉన్నప్పుడే నేరాలు అంతమవుతాయని పేర్కొన్నారు. హత్యలు, దారుణమైన నేరాలకు పాల్పడిన వారి తరఫున వాదించకుండా ఉండాలని న్యాయవాదులను కోరారు. డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, జెడ్పీటీసీ శ్రీలత, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు నరసింహులురెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు నవీన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, శేషగిరి, సతీష్‌రెడ్డి, షాహుల్ తదితరులు పాల్గొన్నారు.


