సారీ.. అమాత్యుడికి తీరిక లేదంట..!
నెల్లూరు (అర్బన్): జిల్లా ఔషధ నియంత్రణ శాఖ భవన నిర్మాణం పూర్తయినా దాన్ని ప్రారంభించడంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిధులను మంజూరు చేసి.. నిర్మాణాలను ప్రారంభించారు. ఆపై ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే వైద్యశాఖ మంత్రికి తీరిక లేదనే కారణంతో నూతన భవనాలు ప్రారంభానికి నోచుకోవడంలేదు. ఫలితంగా జిల్లా ఔషధ నియంత్రణ శాఖ (డ్రగ్ కంట్రోల్ ఏడీ) కార్యాలయం అద్దె భవనంలోనే నడుస్తోంది.
ఉన్నత సంకల్పంతో..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జిల్లా ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైద్య రంగానికి నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీటేశారు. ఇందులో భాగంగా అద్దెలను వృథాగా చెల్లించకుండా ఉండేందుకు గానూ సొంత కార్యాలయాల నిర్మాణానికి సంకల్పించారు. ఇలా రాష్ట్రంలో ఎనిమిది మంజూరయ్యాయి. జిల్లాలో కార్యాలయ నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరయ్యాయి. జిల్లా సర్వజన ఆస్పత్రి ఆవరణలో దిశ పోలీస్‌స్టేషన్ పక్కనే స్థలాన్ని కేటాయించారు. ఆపై నిర్మాణాలను ప్రారంభించారు.
నేటికీ అతీగతీ లేదు..
నిర్మాణాలు పూర్తయి ఏడు నెలలు దాటినా సొంత భవనంలోకి నేటికీ మారలేదు. మరోవైపు దీని చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను ఇటీవల వేలాది రూపాయలను వెచ్చించి తొలగించారు. ఇవి మరోసారి పెరిగే అవకాశమూ లేకపోలేదు. బిల్డింగులు కళావిహీనంగా మారుతున్నాయి. సొంత భవనం ఉండీ అద్దె బిల్డింగుకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. వీటిని ఎందుకు ప్రారంభించలేదనే అంశాన్ని ఆరాతీయగా, తేదీని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ నెలలుగా ప్రకటించకపోవడమేనని తెలిసింది. కాగా ఈ విషయమై జిల్లా ఔషధ నియంత్రణ అధికారులను సంప్రదించగా, అతి త్వరలో ప్రారంభిస్తామని బదులిచ్చారు.
రూ.90 లక్షలతో డ్రగ్ కంట్రోల్ ఏడీ నూతన కార్యాలయం
ప్రారంభ తేదీని ప్రకటించడంలో జాప్యం
గత ప్రభుత్వ హయాంలో నిధులు.. నిర్మాణం
పిచ్చిమొక్కలతో ప్రస్తుతం కళావిహీనంగా


