ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సారథ్యంలోనే దాడులు
● డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్
ఆరోపణల్లో నిజం లేదు
● పదవి కోసం నాలుగేళ్లుగా కుట్రలు
● ఆగ్రహం వ్యక్తం చేసిన స్రవంతి
నెల్లూరు(బారకాసు): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సారథ్యంలోనే దాడులు జరుగుతున్నాయని, అభివృద్ధికి తాను ఆటంకంగా ఉంటే నగరంలో 339 పనులు, పార్కులు తదితర డెవలప్‌మెంట్ వర్క్స్ ఎలా జరిగాయని మేయర్ స్రవంతి ప్రశ్నించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన భర్త జయవర్ధన్‌తో కలిసి ఆమె మాట్లాడారు. డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ తనపై చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని చెప్పారు. మేయర్ పదవి కోసం నాలుగేళ్లుగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు సంబంధించిన ఫైళ్లు తన వద్దకొస్తే, ఎప్పటికప్పుడు సంతకాలు చేసి పంపుతున్నానని, ఈ వివరాలను లెడ్జర్ బుక్‌లో నమోదు చేశారని వివరించారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన కార్పొరేటర్ల మనస్సాక్షికి తానేమిటో స్పష్టంగా తెలుసునన్నారు. నగరంలో గిరిజన సంఘాలు తనకు మద్దతు తెలియజేస్తే.. అక్కడ మీడియా ఇన్‌చార్జి సిరాజ్‌పై దాడులు చేయించారని, ఇదంతా శ్రీధర్‌రెడ్డి సారథ్యంలో జరిగిందని ఆరోపించారు. ఆయన తన మనుషులను పంపి సిరాజ్‌ను బెదిరించారని, అప్పటి నుంచి అతను కనిపించడంలేదని చెప్పారు. సిరాజ్ ఇంటికి మూడు జీపుల్లో పోలీసులు వెళ్లి బెదిరించడం, కొందరు భయభ్రాంతులకు గురిచేయడం లాంటిని ఎమ్మెల్యే జరపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తనను, తన భర్తను కొంతకాలంగా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీ రాజకీయాలను ప్రోత్సహించొద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ను కోరారు.
పదేళ్లుగా దాష్టీకాలు
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత పదేళ్లుగా దాష్టీకాలు జరుగుతున్నాయని జయవర్ధన్ ఆరోపించారు. గతంలో జర్నలిస్ట్ రహీమ్, టీడీపీ నేతలు తిరుమలనాయుడు, మాతంగి కృష్ణ, కార్పొరేటర్ సుధాకర్, రూరల్ ఎమ్మెల్యే వద్ద పదేళ్ల పాటు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వి ష్ణువర్థన్‌రెడ్డిని హతమార్చేందుకు యత్నించారని, దాష్టీకానికి బలయ్యేందుకు తనతో పాటు తన సతీమణి స్రవంతి సిద్ధంగా ఉన్నామన్నారు. 13 ఏళ్ల పాటు ఆయన వద్ద ఊడిగం చేశానని, దీనికి ప్రతిఫలంగా తమపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో కీచక పాలన సాగుతోందని, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఆయన అరాచక పాలన అంతం తమ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే బాధితులు ఏకం కావాలని కోరారు.


