39 సవర్ల నగలు చోరీ
ఉదయగిరి: పట్టణంలోని కోర్టు సమీపంలో గల బీసీ కాలనీలో భారీ చోరీ జరిగింది. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. బీసీ కాలనీలో నివాసం ఉంటున్న యనమల తిరుపతి, రజని దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. పెద్ద కుమార్తె జర్సికాకు వ్యవసాయ విద్యలో ఎమ్మెస్సీలో కౌన్సెలింగ్ నిమిత్తం గుంటూరుకు కుటుంబసభ్యులు గురువారం పయనమయ్యారు. అది పూర్తయిన అనంతరం విజయవాడలో ఉంటున్న చిన్న కుమార్తె వద్దకు శుక్రవారం వెళ్లారు. బస్సులో రాత్రి బయల్దేరి ఇంటికి శనివారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఇంటి కిటికీని తొలగించి ఉండటంతో అనుమానమొచ్చి లోపలికెళ్లి చూడగా బీరువాను ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు. 39 సవర్ల బంగారు అభరణాలు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.ఐదు వేల నగదు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలాన్ని సీఐ వెంకట్రావు, ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి పరిశీలించి వివరాలను సేకరించారు. క్లూస్ టీమ్ పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ పరిశీలించారు. ఇంటి నుంచి కాలనీలో ఉన్న రెండిళ్ల వద్దకెళ్లి ఆగింది. దీంతో ఆ ఇంటి వారిని పోలీసులు విచారించారు. పలువురు అనుమానుతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసును ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.
39 సవర్ల నగలు చోరీ


