ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

Nov 16 2025 7:25 AM | Updated on Nov 16 2025 7:25 AM

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

రూ.90 వేల నగదు, బైక్‌ స్వాధీనం

స్వైపింగ్‌ మెషీన్లను చోరీ చేసి..

నగదు కాజేత

ఆత్మకూరు: పెట్రోల్‌ బంకుల్లోని స్వైపింగ్‌ మెషీన్లను చోరీ చేసి, వాటి ద్వారా నగదును బదిలీ చేసుకుంటున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఇద్దరిని ఆత్మకూరు పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కె వేణుగోపాల్‌ వివరాలు వెల్లడించారు. ఇటీవల ఆత్మకూరు, సంగం, జలదంకిల్లో ఇద్దరు వ్యక్తులు బైక్‌లో పెట్రోల్‌ బంకుల్లో నగదు అత్యవసరంగా కావాలని, తాము ఫోన్‌పే ద్వారా బదిలీ చేస్తామని, నగదు ఇవ్వాలని అడిగి తీసుకున్నారు. అనంతరం పెట్రోల్‌ బంకుల సిబ్బందిని ఏమార్చి ఆ స్వైపింగ్‌ మెషీన్లు చోరీ చేసి అందులోని ‘వాయిడ్‌’ అనే బటన్‌ ప్రెస్‌చేసి తిరిగి నగదు తమ ఖాతాలకు జమ చేసుకోవడంతోపాటు పెట్రోల్‌ బంకుల బ్యాంకు ఖాతాలోని నగదును తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నారని డీఎస్పీ వివరించారు. పెట్రోల్‌ బంకుల్లోని సీసీ కెమెరాల్లో పుటేజీలను పరిశీలించి చోరీకి పాల్పడిన ఆ ఇద్దరు యువకులను ఆత్మకూరు సీఐ ఎం. గంగాధర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసు టీమ్‌ పట్టుందని ఆయన తెలిపారు.

నిందితులది ఉమ్మడి గుంటూరు

పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం రావిపాడుకు చెందిన అనాల శివ, చిలకూరుపేట మండలం కాపూరుకు చెందిన నల్లమళ్ల యర్రబ్బాయి ఉరఫ్‌ లూథర్‌ ఈ నేరాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ప్రత్యేక టీమ్‌తో గాలించి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అనాల శివ గతంలో నరసారావుపేటలోని ఓ పెట్రోల్‌ బంకులో ఐదేళ్లు పనిచేశాడని, ఆ సమయంలో స్వైపింగ్‌ మెషీన్‌ ద్వారా డబ్బులు పంపి ప్రింట్‌ తీస్తుండగా వాయిడ్‌ సేల్‌ అనే బటన్‌ ప్రెస్‌ కావడంతో నగదు తిరిగి పంపిన వ్యక్తి ఖాతాకే జమ అయినట్లు గుర్తించాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుని చోరీలకు పాల్పడడం మొదలు పెట్టినట్లు డీఎస్పీ వివరించారు. తొలుత మిర్యాలగూడలోని పెట్రోల్‌ బంకులో రూ.2 లక్షలు, అనంతరం మేడికొండ, జగ్గయ్యపేట, జీకొండూరు, సూర్యాపేట, కోదాడ, నాగార్జునసాగర్‌ ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంకుల్లో ఈ విధంగా రూ.1.75 లక్షలు స్వైపింగ్‌ మెషీన్ల ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడని అక్కడి పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేసి మిర్యాలగూడ సబ్‌జైలుకు తరలించారు.

జైల్లో పరిచయమైన వ్యక్తితో కలిసి..

ఈ ఏడాది ఆగస్టు 24న జైలు నుంచి విడుదలైన అనాల శివకు నల్గొండ జైల్లో బైక్‌లు దొంగతనం చేసే నల్లమల యర్రబ్బాయి ఉరఫ్‌ లూథర్‌తో పరిచయం అయింది. ఇద్దరు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని స్వైపింగ్‌ మెిషీన్ల ద్వారా దొంగతనాలకు పాల్పడ్డారు. కర్నూలు, నంద్యాల, భీమవరం, నాగర్‌ కర్నూలు, తదితర ప్రాంతాల్లో రూ.2.73 లక్షలకుపైగా నగదును బదిలీ చేసుకుని జల్సాలు చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. రెండు నెలల క్రితం మాచవరంలో ఓ మోటారు సైకిల్‌ను దొంగలించి దానిపై తిరుగుతూ ఈ నెల మొదటి వారంలో నెల్లూరు జిల్లాలో జలదంకి, సంగం, ఆత్మకూరులోని పెట్రోల్‌ బంకుల్లో స్వైపింగ్‌ మెషీన్లు చోరీ చేసి నగదును బదిలీ చేసుకున్నారన్నారు. నిందితుల కోసం గాలిస్తుండగా బైపాస్‌రోడ్డు వద్ద బైక్‌పై వెళ్తుండగా పట్టుకొని వారి వద్ద రూ.90 వేల నగదు, చోరీకి గురైన బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన సీఐ జి.గంగాధర్‌, ఆత్మకూరు, చేజర్ల ఎస్సైలు ఎస్‌కే జిలానీ, జే తిరుమలరావు, ట్రెయినీ ఎస్సై సాయికల్యాణ్‌ను డీఎస్పీ అభినందించి వారికి రివార్డు ఇచ్చేలా ఎస్పీకి సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బి.సాయిప్రసాద్‌, సిబ్బంది చెన్నకేశవులు, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement