శైవ క్షేత్రాల్లో హైకోర్టు న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
సీతారామపురం: మండలంలోని సిద్ధేశ్వరం, భైరవకోన శైవక్షేత్రాలను శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత సందర్శించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శివుడికి అభిషేకాలు, ఇష్టకామేశ్వరి, త్రిముఖ దుర్గాంబదేవి అమ్మవార్లకు కుంకుమార్చన వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించి అమ్మవారి శేష వస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఉదయగిరి జడ్జి అంజయ్య, కోర్టు, పోలీసు సిబ్బంది, ఆలయాలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,709 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 24,053 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.03 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగినవారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకె న్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
సాగుకు గంగమ్మ ఉరకలు
● చీర, సారే, ప్రత్యేక పూజలతో
రబీ సాగుకు నీరు విడుదల
సోమశిల: జిల్లా సాగునీటి సంఘం సలహా నిర్ణయం మేరకు శనివారం జలాశయంలో గంగమ్మకు చీర, సారేతో ప్రత్యేక పూజలు చేసి మొదటి పంటకు ఎస్‌ఈ వెంకటరమణారెడ్డి నీటినీ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ జలాశయం నుంచి ఉత్తర, దక్షిణ, కావలి కాలువలతోపాటు పెన్నాడెల్టా ఆయకట్టు కింద 4.65 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశామన్నారు. జలాశయంలో 73.069 టీఎంసీల నీరు నిల్వ ఉండగా పైతట్టు ప్రాంతాల నుంచి 6,748 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుతుందన్నారు. జలాశయం నుంచి పెన్నా డెల్టాకు 2,650, దక్షిణ కాలువకు 200, కండలేరుకు 560 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు. నీటిని వృథా కాకుండా వాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి, ఈఈ శ్రీనివాసులు, డీఈ రవీంద్ర ప్రసాద్, విజయ్‌కుమార్, జేఈలు నికిల్ తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ ఆస్తుల ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి
● రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ
నెల్లూరు (దర్గామిట్ట): జిల్లాలోని వక్ఫ్ బోర్డు ఆస్తులను కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ షేక్ మహమ్మద్ అలీ ముస్లిం మత పెద్దలకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో వక్ఫ్‌బోర్డ్ ఆధ్వర్యంలో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ముతవల్లిలు, మౌజన్లు, ఇమామ్‌లు, మత పెద్దలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికలు మొదలైన ముస్లింలకు సంబంధించిన సంస్థల పరిధిలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను, భూములను, స్థలాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ఉమ్మిద్ద్ పోర్టల్‌లో సరైన పత్రాలతో అప్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌కు గడువు ఉన్నట్లు ఆయన చెప్పారు. పోటీ పరీక్షల కోసం త్వరలోనే మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు తదితర మైనార్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ కుదావన్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
శైవ క్షేత్రాల్లో హైకోర్టు న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
శైవ క్షేత్రాల్లో హైకోర్టు న్యాయమూర్తి ప్రత్యేక పూజలు


