భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాల నియంత్రణ
● జిల్లా పోలీస్ అధికారులతో
ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): రోడ్డు భద్రతా నియమాలు పాటించడంతో రోడ్డు ప్రమాదా లు తగ్గించవచ్చని ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల అన్నారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలు, నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు జరుగుతు న్న ప్రదేశాలను గుర్తించి ఏ సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎలాంటి వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయో తెలుసుకోవాలని సూచించారు. ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించాలని, బ్లాక్‌స్పాట్లను గుర్తించి ఆర్ అండ్ బీ శాఖ ద్వారా ఇంజినీరింగ్ పనులు చేయించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో సమగ్ర ప్రణాళికలు, ముందస్తు ఏర్పాట్లతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ఎన్‌హెచ్‌ఏఐ, ఇతర శాఖల సమన్వయంతో సైన్ బోర్డులు, లైటింగ్ సిస్టం, పెయింటింగ్ పనులతోపాటు ట్రాఫిక్ కోన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు, విజబుల్ పోలీసింగ్ వంటి పనులు చేపట్టాలని, ద్విచక్ర వాహనదారుల విధిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీసీఆర్‌బీ సీఐ రామారావు, పీఆర్‌పీ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్‌డీ–1 సీఐ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


