కోట్లు గడించేందుకే ప్రైవేటీకరణ ఎత్తుగడ
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి
చిల్లకూరు: పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే ఉన్నతాశయంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని, అయితే కోట్లాది రూపాయలను గడించాలనే లక్ష్యంతో ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ సిద్ధమయ్యారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గూడూరు పట్టణంలో పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఇంటి ఆవరణలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆద్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. సీఎంగా ఎంతో కాలం పనిచేశానని చెప్పుకొనే చంద్రబాబు, రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాలను తీసుకురావాలనే ఆలోచనను ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ప్రజలు గుర్తుంచుకునే ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు. మరొకరు అమలు చేసిన సంక్షేమ పథకాలకు మార్పులు, చేర్పులు చేసి తానే తీసుకొచ్చానని చెప్పే మనస్థత్వం చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ హయాంలో చుక్కల భూముల సమస్యను పరిష్కరించామని గుర్తుచేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం మురళీధర్ మాట్లాడారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఆరోపించారు. హామీలను తుంగలో తొక్కి.. పథకాలను అరకొరగా అమలు చేస్తున్నారని విమర్శించారు. తల్లికి వందనం అందక ఎంతో మంది అల్లాడుతున్నారని చెప్పారు. కార్యకర్తలకు అండగా జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తున్నారని, పార్టీకి వారే బలమని గోపాల్‌రెడ్డి తెలిపారు. ఆయన్ను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సంతకాలను సేకరించారు. మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టా రాధాకృష్ణారెడ్డి, గూడూరు జెడ్పీటీసీ ఊటుకూరు యామిని, ఊటుకూరు మహేంద్రరెడ్డి, నేతలు బత్తిన విజయకుమార్, దువ్వూరు శేషురెడ్డి, ఓడూరు బాలకృష్ణారెడ్డి, చెంచురాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


