నెల్లూరు నగరపాలకసంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు కార్పొరేట్ వ్యవస్థలకు సాగిలపడుతున్నారు. వారిచ్చే ‘రేట్’ను బట్టి అక్రమ
నిర్మాణాలకు అనుమతుల్విడంతోపాటు ఆఖరి వరకు ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. నగరంలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటే.. ముందు అనుమతులిచ్చిన, పర్యవేక్షించాల్సిన టౌన్‌ప్లానింగ్ ప్లానింగ్ అధికారులను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ‘ప్లాన్ ఇచ్చి అఫ్రూవల్ చేయమంటే.. బిల్డింగ్ అంచనా విలువ మేరకు పర్సెంటేజీలు ముడితే కానీ అనుమతులివ్వడం లేదు.’ కట్టేటప్పుడే కట్టడి చేస్తే.. అక్రమ నిర్మాణాలు
ఎందుకు ఉంటాయని సామాన్య ప్రజలు నిలదీస్తున్నారు. బిడ్డల చదువులు, ఉపాధి పేరుతో పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి ఇక్కడే
స్థిరపడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకుని రూపాయి రూపాయి పొదుపు చేసి దాచుకుని కట్టుకున్న సామాన్యుల ఇళ్లను అక్రమ నిర్మాణాలంటూ నిర్దయగా కూల్చేస్తున్న అధికారులు విద్య, వైద్యం, వ్యాపారాల నిర్వహణ సాగించే కార్పొరేట్లు, ప్రజాప్రతినిధుల
అక్రమ కట్టడాల జోలికి వెళ్లికపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
నెల్లూరు (బారకాసు): నెల్లూరు నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పలు ప్రాంతాల్లో భారీ భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్‌ఎంసీ పరిధిలో నిర్మాణ చేపట్టాలంటే ముందుగా కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి బిల్డింగ్ ప్లాన్ అనుమతి పొందాల్సి ఉంది. అయితే కొందరు సొంత భవన యజమానులు నుంచి బిల్డర్లు వరకు అనుమతి పొందిన ప్లాన్‌కు భిన్నంగా మరో రకంగా నిర్మాణం చేపడుతున్నారు. తమ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన్న నేపథ్యంలో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకుండా సంబంధిత అధికారులకు ముడుపులు ముట్ట చెప్పడంతో చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అధికారులను ఆదేశించినప్పుడు వాటిని కూల్చివేస్తున్నారు. ముందుగానే ముడుపులు తీసుకున్న అధికారులు సేఫ్. కానీ రూ.లక్షల ఖర్చు పెట్టి నిర్మించుకున్న యజమానులే తీవ్రస్థాయిలో నష్టపోతున్న పరిస్థితి ఉంది.
శ్రీమంతులకే ఎల్‌ఆర్‌ఎస్
నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన వెంచర్లలో 98 శాతం లేఅవుట్లకు డీటీసీపీ అనుమతులు లేవు. ఇలాంటి అనధికార లేఅవుట్లో నిర్మాణాలకు నగర పాలక సంస్థ అధికారులు ముడుపులు తీసుకుని విచ్చవిలవిడిగా అనుమతులిచ్చేశారు. ఆయా లేఅవుట్లలో భారీ భవనాలతోపాటు ఆకాశ హర్‌ామ్యలను తలపించేలా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా శ్రీమంతుల కుటుంబాలకే చెందినవి కాబట్టి వాటి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిస్తున్నాయి. వీరికి మాత్రం నిర్మాణాలు కట్టేసుకున్నా.. ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) వర్తింప చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాకులాడుతున్నారు.
అనధికార లేఅవుట్లలో అక్రమ అంతస్తులు
నెల్లూరులో అనేక అనధికార లేఅవుట్లు వెలిశాయి. వాటిలో ప్లాట్లను సదరు యజమానులు విక్రయించారు. కొనుగోలు చేసిన వారు తమ ప్లాట్లలో భవన నిర్మాణాలు చేసుకుంటున్నారు. అయితే అనధికార లేఅవుట్లలో నిర్మాణాలు చేపట్టాలంటే ప్లాన్ అనుమతికి ప్రభుత్వం నిర్ణయించిన రుసుంతోపాటు అదనంగా మరో 14 శాతం రుసుం చెల్లించాల్సి ఉంది. అయితే కొందరు ఈ విషయం తెలియక ప్లాన్ అఫ్రూవల్ రుసుం వరకు చెల్లించి నిర్మాణాలు చేసుకున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కనీసం అదనపు రుసుం చెల్లించాలని చెప్పడం లేదు. కొద్ది రోజుల తర్వాత అనధికార లేఅవుట్లలో నిర్మించారంటూ ఆ భవనాలను కూల్చేయాలని యజమానులకు నోటీసులిచ్చి బెదిరిస్తున్నారు. దీంతో మరో సారి ముడుపులు ముట్టుజెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొందరు లీగల్‌గా వెళ్లి ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిర్దయగా ధ్వంసం చేస్తున్నారు. ఇదంతా మంత్రి నారాయణ ఆదేశాలంటూ నగర పాలక సంస్థ అధికారులు హడావుడి చేస్తున్నారు.
నుడా అనుమతుల్లేకుండా టీడీపీ కార్యాలయం సమీపంలో వేసిన ఏఎంఆర్ లేఅవుట్‌లో బహుళ అంతస్తుల భవనాలు
అక్రమం..
సక్రమానికే ఎల్‌ఆర్‌ఎస్
అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్లు వేసిన వాటిని సక్రమం చేసుకునేందుకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా సదరు యజమానులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన రుసుం చెల్లించితే అనధికార లేఅవుట్ కాస్త అధికారిక అప్రూవల్ లేఅవుట్‌గా మారిపోతుంది. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని 2026 జనవరి నెల వరకు గడువు ఇచ్చింది. ఇప్పటి వరకు 1800 దరఖాస్తులు వచ్చాయి. మరో రెండు నెలలకు పైగా గడువు ఉండడంతో మరో మూడు నాలుగు వందలు దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని టౌన్‌ప్లానింగ్ అధికారులే అంటున్నారు.
బీపీఎస్ పథకం కూడా...
నగర పాలక సంస్థ నుంచి ప్లాన్ అనుమతి పొందకుండానే భవన నిర్మాణం చేపట్టిన వారు ఈ బీపీఎస్ పథకం ద్వారా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన రుసుం చెల్లించితే నిర్మించిన భవనానికి ప్లాన్ మంజూరు చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ బీపీఎస్ పథకాన్ని రెండు రోజుల క్రితం విడుదల చేసింది.
మంత్రి నారాయణ ఆదేశాలంటూ...
ఎన్‌ఎంసీలోని టౌన్‌ప్లానింగ్ అధికారులు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నిబంధనలు అతిక్రమించి, అనుమతులు పొందకుండానే చేపట్టిన భవన నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే 20 భవనాలను కూల్చివేశారు. అనుమతి లేకుండా నిర్మించిన అదనపు అంతస్తులను, మరి కొన్నింటిని పిల్లర్ల దశలోనే తొలగించే చర్యలు చేపట్టారు. అయితే కొందరు భవన యజమానులు తాము ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నామని, అయినా నిర్మాణాన్ని తొలగించారని వాపోతున్నారు. అయితే 2025 ఆగస్టు 31వ తేదీ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలనే తొలగిస్తున్నామని టౌన్‌ప్లానింగ్ అధికారులు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మరికొన్ని బహుళ అంతస్తుల భవనాలపై చార్జిషీట్ వేసి కోర్టుకు నివేదిస్తున్నామన్నారు. ఇలాంటివి దాదాపు 130 వరకు చార్జిషీట్లు వేసి కోర్టుకు సమర్పించామన్నారు.
భవన నిర్మాణాల్లో సంపన్నులకు కొమ్ము కాస్తున్న అధికారులు
మంత్రి నారాయణ చెప్పారంటూ సామాన్యులపైనే ప్రతాపం
అక్రమ నిర్మాణ యజమానుల నుంచి దండకాలు
అడిగినంత ఇవ్వకపోతే కూల్చివేతే
ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నా వదలని వైనం
అధికారుల పక్షపాత వైఖరిపై అధికార పార్టీ ఎమ్మెల్యేనే సీరియస్
మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లే ధైర్యం లేదా అంటూ నిలదీత
దమ్ముంటే ప్రజాప్రతినిధులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హితవు
నగరంలో మంత్రి నారాయణ
భవనాలను వదిలేసి సామాన్యుల
ఆస్తులపై చర్యలపై సర్వత్రా విమర్శలు
అనధికార లేఅవుట్లలో నిర్మాణాలకు అనుమతులు


