45 రోజులు అండర్ బ్రిడ్జి, ఫ్లై ఓవర్ మూత
● కమిషనర్ వైఓ నందన్
నెల్లూరు(బారకాసు): నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి, ఫ్లై ఓవర్‌పై ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ వైఓ నందన్ తెలిపారు. నగరంలోని ఎన్‌ఎంసీ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షను శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నగరంలో ఏడు ప్రధాన కూడళ్లలో దాదాపు రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఈనెల 16 లేదా 17వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిగ్గా చలానాలు విధించే విధానాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి మరమ్మతులు, ఫ్లై ఓవర్‌పై జాయింట్ల వద్ద రిపేర్లు తదితర పనులను రూ.40 లక్షలతో ఈనెల 16వ తేదీ నుంచి చేపట్టి సుమారుగా 45 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు నుంచి వచ్చే వాహనాలు నూతన పెన్నా వారధి పైనుంచి లేదా శెట్టిగుంట రోడ్డు రైల్వేలైన్ ప్రాంతం నుంచి నగరంలోకి రావాలన్నారు. నవాబుపేట, బాలాజీ నగర్ పరిసర ప్రాంతాల నుంచి విజయమహల్ గేటు లేదా రామలింగాపురం అండర్ బ్రిడ్జి మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ డీఈఈ మహబూబ్, ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, నేషనల్ హైవే అథారిటీ ఏఈ సుమన్ పాల్గొన్నారు.


