పక్కాగా భోజన పథకం అమలు
● రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు
కందుకూరు రూరల్: మధ్యాహ్న భోజనం పథకాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి.కాంతారావు సూచించారు. గుడ్లూరు మండలంలోని పోట్లూరు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, గుడ్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కందుకూరు మండలంలోని మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కందుకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికోన్నత పాఠశాలలను శుక్రవారం ఆయన పరిశీలించారు. కోడిగుడ్లు, స్టాక్ వివరాలను ఆరాతీశారు. పలు రికార్డులను తనిఖీ చేసి సూచనలిచ్చారు. జెడ్పీ స్కూల్లో భోజనం రుచి చూశారు. బాలల దినోత్సవం సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కందుకూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహార విషయంలో అశ్రద్ధగా ఉన్నా, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. చౌక దుకాణాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు బియ్యం, చక్కెరను సకాలంలో అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ లీలారాణి, డీఎం అర్జున్‌రావు, సమన్వయ అధికారి సైమన్ బాబు, కందుకూరు విద్యాశాఖాధికారులు కుమారశర్మ, కె.సుబ్బారెడ్డి, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.


