కారు ఢీకొని మహిళ దుర్మరణం
వలేటివారిపాలెం: దైవ దర్శనానికెళ్తూ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని మాలకొండ మెయిన్ అర్చి వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని చుండికి చెందిన ఇరుపని దత్తుమణి (31), మాధవరావుకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. పిల్లల్లేకపోవడంతో మాలకొండ లక్ష్మీనరసింహ దేవస్థానానికి కాలినడకన ఐదు వారాలు వెళ్లాలని సిద్ధాంతి సలహా ఇచ్చారు. ఈ తరుణంలో మొక్కు నిమిత్తం దంపతులు నడుచుకొని వస్తుండగా, మాలకొండ మెయిన్ అర్చి వద్ద ఉదయం 6.30 గంటల ప్రాంతంలో కందుకూరు వైపు నుంచి అతి వేగంతో వస్తున్న కారు ఆమెను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను 108లో కందుకూరులోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించారని వైద్యులు నిర్ధారించారు. భర్త ఫిర్యాదు మేరకు ఎస్సై మరిడినాయుడు కేసు నమోదు చేశారు.


