విషాద ప్రయాణాలు | - | Sakshi
Sakshi News home page

విషాద ప్రయాణాలు

Nov 16 2025 7:25 AM | Updated on Nov 16 2025 7:25 AM

విషాద

విషాద ప్రయాణాలు

జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. వీటిపై ప్రయాణించేందుకు ప్రజలు హడలిపోతున్నారు. నిత్య ప్రమాదాల కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయారు. సరైన ప్రమాణాలు పాటించకపోవడం, దీనికితోడు ప్రయాణికుల నిర్లక్ష్యం కూడా కారణమనే ప్రచారముంది.

మృత్యుమార్గాలు

ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గం మీదుగా రెండు హైవేలున్నాయి. నెల్లూరు – ముంబై (ఎన్‌హెచ్‌ 67) ఒకటి కాగా, ఏర్పేడు – నకిరేకల్‌ (ఎన్‌హెచ్‌ 565) మరొకటి. వీటి పరిధిలోని ఆత్మకూరు, మర్రిపాడు, సంగం, అనంతసాగరం మండలాల్లో వందలాది ప్రమాదాలు చోటు చేసుకుని పదులకొద్దీ మృత్యువాతపడిన ఘటనలు ఏడాది కాలంలో చాలా ఉన్నాయి. టీడీపీ నాయకులకు చెందిన అక్రమ ఇసుక రవాణా వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు గుర్తించిన ప్రాంతాల్లో వేగం తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డ్రమ్ములు తదితరాలను వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగిన ఘటనలున్నాయి. జాతీయ రహదారులకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండటం ప్రమాదాలకు ఒక కారణమని పలువురు పేర్కొంటున్నారు.

ఎన్నో ప్రమాదాలు

● ఆత్మకూరు మండల పరిధిలో 25 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 13 మంది మృత్యువాతపడ్డారు. 32 మంది గాయాలపాలయ్యారు.

● సంగం మండల పరిధిలో ఏడాది కాలంలో 24 ప్రమాదాలు జరగ్గా, 23 మంది చనిపోయారు. 18 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

● అనంతసాగరం మండల పరిధిలో ఐదు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా ఐదుగురు మృతిచెందారు. ఏడుగురు గాయపడ్డారు.

● మర్రిపాడు మండల పరిధిలో 14 ప్రమాదాలు జరగ్గా ఇద్దరు మృత్యువాత పడ్డారు. 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

కందుకూరు: వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు నుంచి సింగరాయకొండ వద్ద ఉన్న చైన్నె – కోల్‌కతా జాతీయ రహదారి 16ను అనుసంధానం చేస్తూ నూతనంగా జాతీయ రహదారి 167బీని 189 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి ప్యాకేజీ కింద సింగరాయకొండ నుంచి మాలకొండ వరకు 45.73 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టారు. ప్రధాన రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 9 నెలల వ్యవధిలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

అందువల్లేనా..?

సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డు నిర్మాణం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన ప్రాంతాల గురించి పట్టించుకోలేదు. రోడ్డు మొత్తాన్ని రెండు వరుసలుగా నిర్మించినా ఎక్కువగా మలుపు ఉండటం, అండర్‌పాస్‌లు లేకపోవడం ప్రమాదాలకు కారణంగా ఉంది. జాతీయ రహదారి నుంచి అనేక గ్రామాలకు వెళ్లే రోడ్లు ఉన్నాయి. ప్రధానంగా కందుకూరు బైపాస్‌ రోడ్డులో చుట్టుగుంట, దివివారిపాళెం, కొండముడుసుపాళెం తదితర గ్రామాలకు వెళ్లేందుకు రోడ్డు దాటాల్సి ఉన్నా ఎక్కడా అండర్‌పాస్‌లు లేవు. అలాగే కందుకూరు నుంచి సింగరాయకొండ మధ్య వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నా రెండు వరుసలు మాత్రమే కావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

వేగ నియంత్రణ డ్రమ్ములను ఢీకొని..

ఇటీవల ప్రమాదాలు అధికంగా జరుగుతుండటంతో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు కీలకమైన మలుపులు, గ్రామాల వద్ద హైవే అధికారులు డ్రమ్ములను ఉంచారు. ఇవి కూడా ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. రాత్రిపూట స్పష్టంగా కనిపించే విధంగా రేడియం స్టిక్కర్‌లు ఏర్పాటు చేయలేదు. దీంతో కందుకూరు నుంచి సింగరాయకొండ వెళ్తూ ఓగూరు వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న డ్రమ్ములను ఢీకొని ఇటీవల ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సరైన చర్యలు తీసుకోకపోవడం జాతీయ రహదారి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది.

అతివేగమూ ఒక కారణం

మితిమీరిన వేగంతో కొందరు వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాల్లో అతివేగం, నిర్లక్ష్యమే కారణమని నిర్ధారణకు వచ్చారు. వాహనం నడిపే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని, ప్రధానంగా కార్లు నడిపే వారి అధిక వేగం కారణంగా ఎదురువచ్చే వాహనాలను ఢీకొంటున్నారని విశ్లేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి జరిమానాలు కూడా విధించడం లేదు.

ఇటీవల జరిగినవి..

ప్రమాదాలకు నిలయంగా జాతీయ రహదారి 167బీ

వరుస ప్రమాదాలతో

ప్రయాణమంటేనే హడల్‌

తొమ్మిది నెలల వ్యవధిలో

30 మంది వరకు మృతి

ప్రజలకు శాపంగా మారిన

అధికారుల అలసత్వం

పలుకూరు అడ్డరోడ్డు వద్ద వేగ నియంత్రణ కోసం పెట్టిన డ్రమ్ములను ఢీకొని కందుకూరు పట్టణానికి చెందిన చదలవాడ రాజేంద్రప్రసాద్‌బాబు అనే యువకుడు నాలుగు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయాడు. దీనికి ముందు నక్షత్ర కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దుర్గేష్‌ బైక్‌పై సింగరాయకొండ వెళ్తూ ఓగూరు వద్ద రోడ్డుకు అడ్డుగా పెట్టిన డ్రమ్ములను ఢీకొని చనిపోయాడు.

దసరా పండుగ రోజున మాల్యాద్రి కాలనీ సమీపంలో బైక్‌ను కారు ఢీకొనడంతో ప్రభుత్వ టీచర్‌ అశోక్‌ మృతిచెందాడు. కారులో ఉన్న పెళ్లి బృందంలోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఏప్రిల్‌లో పట్టణానికి దక్షిణవైపు ఉన్న బైపాస్‌ రోడ్డులో చుట్టుగుంట క్రాస్‌ వద్ద బైక్‌ను వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో పోతురాజుమిట్టకు చెందిన గోతాల వ్యాపారి రమణయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో వలేటివారిపాళేనికి చెందిన కాటా అంజయ్య కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. అంజయ్య భార్య పుష్ప చికిత్స పొందుతూ మరణించారు.

మేలో వలేటివారిపాళెం వద్ద అంకభూపాలపురం క్రాసింగ్‌ వద్ద జరిగిన ట్రాక్టర్‌, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో అత్తింటివారిపాళేనికి చెందిన కొల్లూరి మాధవరావు (45) అనే వ్యక్తి మరణించారు. ఈ స్పాట్‌లో ఇప్పటి వరకు ఐదు ప్రమాదాలు జరిగాయి. ముగ్గురు చనిపోగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.

పోకూరు వద్ద బైక్‌, కారు ఢీకొన్న ప్రమాదంలో శింగమనేనిపల్లి గ్రామానికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బాశం దినేష్‌ (25) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కందుకూరు నుంచి వలేటివారిపాళెం మధ్యలో నాలుగు నెలల వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో దాదాపు ఏడుగురు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.

ఓగూరు వద్ద లారీ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న గంగవరపు వెంకటేశ్వర్లు అనే రైతు మృతిచెందాడు. ఇదే ప్రాంతంలో రవి గార్డెన్స్‌ వద్ద బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో జరుగుమల్లి మండలం చిరుకూరపాడుకు చెందిన మెడబలిమి నాగరాజు అనే యువకుడు చనిపోయాడు.

విషాద ప్రయాణాలు1
1/3

విషాద ప్రయాణాలు

విషాద ప్రయాణాలు2
2/3

విషాద ప్రయాణాలు

విషాద ప్రయాణాలు3
3/3

విషాద ప్రయాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement