పెద్దాస్పత్రిలో మరో అమానవీయ ఘటన
నెల్లూరు (అర్బన్): ఏడు పదుల వయస్సు దాటిన ఆ వృద్ధుడి శరీరంపై సరైన ఆచ్చాదనం లేదు. కాళ్ల పటువున నిలబడే శక్తి లేదు. పైగా కాలికి గాయమై రక్తం చిందుతోంది. ఆ గాయం బాధను భరిస్తున్నప్పటికీ ఈగలు ముసురుకుని కుడుతుంటే.. బాధను, కన్నీళ్లను దిగమింగుకుని వైద్యం చేయమని ప్రాధేయపడుతూ పెద్దాస్పత్రి ఓపీ వద్ద వేడుకున్నా.. పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. అటూ ఇటూ తిరుగుతున్న వైద్యులు, నర్సులు చూస్తున్నారనే కానీ.. పక్కకు జరుగు అంటూ ఈసడించుకుంటూ వెళ్తున్న పరిస్థితి వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఇటీవల ఓ వృద్ధురాలిని ఈడ్చి పడేసిన ఘటన మరువక ముందే మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పెద్దాస్పత్రిలో తరచూ వెలుగుచూస్తున్న ఇలాంటి ఘటనలు వైద్యులు, వైద్య సిబ్బంది మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఈ వృద్ధుడి పేరు రామమూర్తి. నార్త్ ఆములూరుకు చెందిన ఆయనకు సుమారు 70 ఏళ్లకు పైబడి వయస్సు ఉంటుంది. కాలికి గాయంతో నడవలేక, కూర్చోలేక అల్లాడిపోతున్నాడు. గాయం కారణంగా కారుతున్న రక్తం, ఆ గాయంపై ఈగలు ముసురు బాధకు కన్నీరు గార్చుతున్నాడు. దోగాడుతూ పెద్దాస్పత్రి ఓపీ విభాగం ఎదురుగా ఉన్న వాకిట్లో పడిపోయాడు. తనకు వైద్యం చేయాలని వేడుకుంటున్నాడు. గాయానికి కట్టు అయినా కట్టాలని దీనంగా వేడుకుంటున్నా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది పట్టించుకోలేదు.


