‘తుంగభద్రకు పట్టిన గతి తప్పదు’ | - | Sakshi
Sakshi News home page

‘తుంగభద్రకు పట్టిన గతి తప్పదు’

Oct 19 2025 6:11 AM | Updated on Oct 19 2025 6:13 AM

సోమశిల: నెల్లూరు జిల్లా రైతాంగానికి తాగు, చైన్నె, తిరుపతి నగరాలకు తాగునీరందించే సోమశిల జలాశయం భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రాజెక్ట్‌ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం గండం పొంచి ఉందని తెలుస్తోంది. ప్రాజెక్ట్‌ నిర్వహణకు గతంలో సుమారు 30 మంది వరకు సిబ్బంది విధుల్లో ఉండేవారు. అయితే ప్రస్తుతం కేవలం నలుగురికే పరిమితం కావడంతో జలాశయం నిర్వహణ లోపం కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌ పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 74 టీఎంసీలు ఉన్నాయి.

ఎందుకీ భయం.. ఏమానుమానాలు?

సోమశిల జలాశయానికి 12 క్రస్ట్‌ గేట్లు ఉన్నాయి. అన్ని క్రస్ట్‌ గేట్ల ద్వారా ఒకేసారి నీటిని విడుదల చేస్తే 24 గంటల వ్యవధిలో గరిష్టంగా 6 లక్షల నుంచి 6.50 లక్షల నీటి విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జలాశయంలో 11, 12వ క్రస్ట్‌ గేట్లు పూర్తిగా బ్లాక్‌ అయ్యాయి. గేట్లు లిఫ్ట్‌ చేసే రోప్‌లు పూర్తిగా దెబ్బతినడంతో అవి లిఫ్ట్‌ అయ్యే సమయంలో తెగిపోయే అవకాశం ఉండడంతో రోప్‌లు మార్చే ప్రక్రియ విషయంలో సంబంధిత అధికార యంత్రాంగం ఆది నుంచి అలవికాని నిర్లక్ష్యం ప్రదర్శించింది. జలాశయంలో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్న సమయంలోనే చేయాల్సి ఉన్నా.. వేసవి కాలం అంతా పట్టించుకోలేదు. తాజాగా ఎగువ నుంచి ఇటీవల వరద రావడంతో ప్రాజెక్ట్‌ పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌ నుంచి కేవలం 5, 6, 7 క్రస్ట్‌ గేట్ల నుంచి మాత్రమే నీటిని దిగువకు విడుదల చేయడంతో మిగతా గేట్ల లిఫ్ట్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 8, 9, 10 గేట్ల రోప్‌లు సైతం తుప్పు పట్టి ఉన్నాయి. దాదాపుగా నాలుగేళ్లుగా ఈ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన సందర్భం లేదు. ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా ప్రాజెక్ట్‌ క్రస్ట్‌ గేట్ల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. భారీ స్థాయిలో వరదలు వస్తే పరిస్థితి ఏమిటనే భయం జిల్లా వాసులను వెంటాడుతోంది.

వణికించిన 2021 నవంబర్‌ వరదలు

సోమశిలకు నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఎన్నడూ భారీ స్థాయిలో వరదలు వచ్చిన సందర్భం లేదు. 2021 నవంబర్‌లో ఎగువన అన్నమయ్య డ్యామ్‌ తెగి ప్రాజెక్ట్‌కు ఊహించని స్థాయిలో వరద వచ్చింది. రాత్రికి రాత్రే ఒక్కసారిగా ప్రాజెక్ట్‌ 12 క్రస్ట్‌ గేట్లు ఎత్తి సుమారుగా 6 లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో దిగువన పెన్నానది తీరం వెంబడి అనేక ప్రాంతాల ముంపునకు గురయ్యాయి. ఎగువ నుంచి వచ్చిన వరదను ఆ స్థాయిలో దిగువకు విడుదల చేయకపోతే ప్రాజెక్ట్‌ ప్రమాదంలో పడేదని జలవనరుల నిపుణులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో గండం గడిచిపోయింది. ఆ తర్వాత ఆ స్థాయిలో గత మూడేళ్లుగా వరదలు రాలేదు.

నూతన రోప్‌లు వచ్చి నాలుగు నెలలు

రాష్ట్ర జలవనరుల సాంకేతిక సలహాదారు కన్నయ్యనాయుడు పరిశీలించిన రెండు నెలలకు కాంట్రాక్ట్‌ అప్పగించి నూతన రోప్‌లను ప్రాజెక్ట్‌ వద్దకు చేర్చారు. అప్పట్నుంచి సుమారు నాలుగు నెలలు అవుతున్న రోప్‌ల మరమ్మతులు చేయలేదు, ఇటీవల ఒకటో నంబర్‌ క్రస్ట్‌ గేటుకు స్టాప్‌ లాక్‌ అమర్చి మరమ్మతు చేయాలని ముందుకు వచ్చారు. ఈ తరుణంలో వరదలు వచ్చి జలాశయం పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం నీటిలో రోప్‌లో మార్చేందుకు సంబంధిత వర్కర్లు రావడం లేదని జలాశయ అధికారులే చెబున్నారని సమాచారం.

పొంచి ఉన్న ప్రమాదం

గ్రేటర్‌ రాయలసీమపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు విస్తరించిన సమయంలో అడపాదడపా వర్షాలు కురిసినా రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పెద్దగా వర్ష ప్రభావం ఉండదు. తాజాగా ఈశాన్య రుతుపవనాలు రాకతో వాతావరణ మార్పులు సంభవించాయి. ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ ఆకస్మిక వర్షాలు, వరదలు వస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో వర్షాలు పడుతాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల ప్రభావంగా ఎగువ ప్రాంతాల్లో, జలాశయ ప్రాంతంలో కురిసే ప్రతి వర్షపు చుక్క నేరుగా సోమశిల జలాశయానికి చేరుతోంది. ఇప్పటికే నిండుకుండగా ఉన్న జలాశయానికి వచ్చే వరద జలాలను నిల్వ ఉంచేందుకు వీలులేనందున దిగువకు విడుదల చేయాల్సి పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో గతంలో వచ్చిన స్థాయిలో వరద వస్తే.. క్రస్ట్‌ గేట్లను లిఫ్ట్‌ చేసి వరద దిగువకు విడుదల చేయాలంటే.. 11, 12 క్రస్ట్‌ గేట్లు పూర్తిగా బ్లాక్‌ అయిపోవడంతో మిగిలిన పది గేట్లలో ప్రస్తుతం 5, 6, 7 క్రస్ట్‌ గేట్లు సేఫ్‌గానే ఉన్నాయని ఇటీవల స్పష్టమైంది. మిగతా గేట్ల విషయంలో జలాశయం అధికారులకే స్పష్టత లేదని సంబంధిత అధికార వర్గాల ద్వారా స్పష్టమవుతోంది.

ఎనిమిది నెలల క్రితం రాష్ట్ర జలవనరుల సాంకేతిక సలహాదారు కన్నయ్యనాయుడు జలాశయ స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రాజెక్ట్‌ పరిశీలనకు వచ్చారు. జలాశయ ఎస్‌ఈ, ఈఈ, డీఈ, సిబ్బందితో కలిసి జలాశయ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన క్రస్ట్‌ గేట్ల దుస్థితి చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్ల విషయంపై కనీస నిర్వహణ చేయకపోవడంతో ఆయన మండి పడ్డారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ గేట్లకున్న రోప్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి.. ఇలానే మార్చకుండా మరమ్మతులు చేయకుండా వదిలేస్తే గతంలో తుంగభద్రకు పట్టిన గతి ఈ ప్రాజెక్ట్‌కు పడుతుందన్నారు.

‘తుంగభద్రకు పట్టిన గతి తప్పదు’ 
1
1/1

‘తుంగభద్రకు పట్టిన గతి తప్పదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement