
పత్రికా స్వేచ్ఛను హరించడమే
ఉదయగిరి: ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికా రంగం మూల స్తంభం. వార్తల విషయంలో ప్రతికలకు ఎంతో స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తోందంటూ ఉదయగిరి నియోజకవర్గంలోని పలువురు విలేకరులు ధ్వజమెత్తారు. ‘సాక్షి’ మీడియాపై ప్రభుత్వం కేసులు బనాయించడం, పోలీసులతో కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ భయభ్రాంతులకు గురి చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో మస్తాన్‌రెడ్డిలకు అర్ధరాత్రి నోటీసులు జారీ చేయడం, విచారణ పేరుతో వేధించడం తగదన్నారు. పత్రికలు ప్రజల తరపున పోరాడే వ్యవస్థ అని, ప్రచురించే వార్తలో సందేహాలుంటే న్యాయబద్ధ రీతిలో వ్యవహరించాలి తప్ప అక్రమంగా కేసులు పెట్టడం తగదన్నారు. ఈ ధోరణితో ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.