
అమరావతికి రేషన్ పంచాయితీ
నెల్లూరు సిటీ: జిల్లాలో టీడీపీ నేతలు విచ్చలవిడిగా సాగిస్తున్న రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం ఆ పార్టీని ఇరకాటంలో పెట్టింది. నెలకు రూ.కోట్లల్లో ఈ దందా జరుగుతోంది. అయితే తమకు అందాల్సిన వాటాలు అందకపోవడమో.. మరేదో తెలియదు కానీ.. ఆ పార్టీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇటీవల మంత్రి నారాయణ కీలక అనుచరుడు, సివిల్‌సప్లయ్స్ శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని ప్రత్యక్షంగా, జనసేన పార్టీని పరోక్షంగా డీసీఎం పవన్‌కల్యాణ్, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను టార్గెట్ చేసి రేషన్ మాఫియా దందాపై బహిరంగంగా ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ పరిణామాలు రెండు పార్టీల్లోనూ కాక పుట్టించింది. టీడీపీ నేత బహిరంగ విమర్శలు ఆ పార్టీకి తలనొప్పిగా పరిణమించాయి. మంత్రి నారాయణ నియోజకవర్గ పరిధిలోని నేతలు పార్టీ పరువును బజారుకీడ్చడంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. మరో వైపు నాదెండ్ల మనోహర్ సైతం మంత్రి నారాయణపై తీవ్రస్థాయిలో అసహానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈక్రమంలో నారాయణ సదరు నేతలపై టెలికాన్ఫరెన్స్‌లో తీవ్ర స్థాయిలో మండిపడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుస పరిణామాలు కూటమి పార్టీలను ఇరకాటంలో పెట్టడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిలను శనివారం అమరావతికి పిలిపించిన పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చీవాట్లు పెట్టారని సమాచారం. బహిరంగ విమర్శలు ఎందుకు చేసుకున్నారు? రేషన్ బియ్యంలో పాత్ర ఎవరిది ఉంది? మీడియా ముందు ఎందుకు విమర్శలు చేశారు? అంటూ పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఈ విషయంపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పినట్లు సమాచారం. మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిసింది. వీరిద్దరితోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కూడా పాల్గొన్నారు.
టీడీపీ నేతల మధ్య రేషన్ బియ్యం విభేదాలు
నుడా చైర్మన్ కోటంరెడ్డి బహిరంగ విమర్శలపై అధిష్టానం సీరియస్
మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్ పెట్టి ఆగ్రహం
జిల్లా నేతలకు చీవాట్లు పెట్టిన పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు పల్లా