
మమ్మల్నెందుకు వదిలేశారు..?
ఇందుకూరుపేట / కోవూరు: అమ్మా.. నాన్నా.. ఎక్కడికెళ్లారు.. మమ్మల్నెందుకు వదిలేశారు.. అంటూ చిన్నారుల వేదన చూపరులను కలిచివేసింది. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ఎలా అనే ఆలోచన గ్రామస్తులను దహించేస్తోంది. సంగం మండలంలోని పెరమన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్లగుండ్ల శ్రీనివాసులు, లక్ష్మి దంపతులు మృతి చెందగా, వారి భౌతికకాయాలు స్వగ్రామానికి బుధవారం అర్ధరాత్రి చేరుకున్నాయి. ఉదయం వరకు అందరితో మాట్లాడిన వారు ఇప్పుడు విగతజీవులుగా మారిపోవడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులను కోల్పోయి చందుప్రియ (పదో తరగతి), విశ్వంత్ (ఆరో తరగతి) అనాథలయ్యారు.
కంటికి రెప్పలా కాపాడుకుంటూ..
చిన్నతనం నుంచే చందుప్రియ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వైద్యుల సూచనల మేరకు తరచూ పరీక్షలు చేయించేవారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడుతూ.. చదువులు నేర్పాలని కలలుగన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా దూరం కావడంతో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. వీరికి ప్రభుత్వం అండగా నిలిచి.. చదువు, వైద్యానికి సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆదుకోకపోతే నిరసన
ఇసుక అక్రమ రవాణానే ఈ ప్రమాదానికి కారణమని సీపీఎం నేతలు ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆర్థిక సాయమందించాలని, లేని పక్షంలో నిరసనలను చేపడతామని స్పష్టం చేశారు.

మమ్మల్నెందుకు వదిలేశారు..?