
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
● మృతుల కుటుంబాలకు పరామర్శ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో పగలూ, రాత్రనే తేడా లేకుండా ఇసుకను అక్రమంగా భారీ వాహనాల్లో తరలిస్తూ ఎంతో మంది ప్రాణాలను బలిగొంటున్నా, అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సంగం మండలం పెరమన వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి భౌతికకాయాలకు నగరంలోని 16వ డివిజన్లో గల గుర్రాలమడుగు సంఘంలో గురువారం నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి.. అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం బాధాకరమని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆరోపించారు. అవినీతి సంపాదన కోసం ఎన్ని కుటుంబాలను బలి తీసుకుంటారని ప్రశ్నించారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాతో ఇలాంటి ప్రమాదాలు కోకొల్లలుగా జరుగుతున్నాయని మండిపడ్డారు. ఉచిత ఇసుక పేరుతో అనధికారికంగా తరలిస్తూ ప్రభుత్వాదాయానికి అధికార పార్టీ నేతలు గండికొడుతున్నారని ధ్వజమెత్తారు. సోమశిల నుంచి నీటిని ఇటీవల విడుదల చేస్తే, విరువూరు రీచ్ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితులు అందరికీ తెలుసునన్నారు. ఇసుక, గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తూ.. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న వారిపై ఎస్పీ కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. టిప్పర్ డ్రైవర్‌పైనే కాకుండా ప్రమాదానికి కారణంగా భావించే అధిక లోడు ఇసుకను తరలిస్తున్న వ్యక్తులు, వాహన యజమానిపై కేసు నమోదు చేయాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25 లక్షలను అందించడంతో పాటు మరో రూ.25 లక్షలను ప్రమాదానికి కారణమైన వారి నుంచి బాధిత కుటుంబాలకు అందించి ఆదుకోవాలని పేర్కొన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కాంక్షించారు.