
వాహనమిత్రకు దరఖాస్తు చేసుకోండి
నెల్లూరు రూరల్: వాహనమిత్ర పథకం కోసం ఆటో, మ్యాక్సీ క్యాబ్ యజమానులు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో శుక్రవారంలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఆర్సీ, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సురెన్స్, ఫిట్‌నెస్ తదితర సర్టిఫికెట్లను జతపర్చాలని సూచించారు. బ్యాంక్ ఖాతాకు ఆధార్, ఎన్పీసీఐను లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు. 2023 వరకు దరఖాస్తు చేసిన వారు మరోసారి చేయాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా స్థాయి అండర్ – 19 అథ్లెట్ల ఎంపికలు రేపు
నెల్లూరు (టౌన్): ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి అండర్ – 19 బాలబాలికల అథ్లెటిక్స్ క్రీడాకారులను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శనివారం ఎంపిక చేయనున్నామని డీవీఈఓ కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలల విద్యార్థులను పంపాలని కోరారు. విద్యార్థినులకు సహాయకులుగా మహిళా వ్యాయామ అధ్యాపకులు లేదా మహిళా సిబ్బందిని పంపాలన్నారు.
12 బార్లకు లాటరీ డ్రా
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో తొలి విడతలో మిగిలిన 33 బార్లకు రీనోటిఫికేషన్‌ను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అఽధికారులు జారీ చేయగా, 12కు మాత్రమే దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ క్రమంలో బార్ లైసెన్స్‌ల కేటాయింపు ప్రక్రియను కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం నిర్వహించారు. ఓపెన్ కేటగిరీలో నెల్లూరు కార్పొరేషన్లో ఏడు.. కావలి మున్సిపాల్టీలో మూడు.. బుచ్చిరెడ్డిపాళెంలో ఒకటి.. అల్లూరు నగర పంచాయతీలో గీత కులానికి చెందిన ఒక బార్‌కు లాటరీ తీసి వ్యాపారులకు కేటయించారు. మిగిలిన వాటికి నోటిఫికేషన్‌ను మరోసారి జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అఽధికారి శ్రీనివాసులునాయుడు, ఏఈఎస్ రమేష్ పాల్గొన్నారు.
ఈసీ x టీఏ
● ఉపాధి హామీ కార్యాలయంలో
బూతు పురాణం
దుత్తలూరు: స్థానిక ఉపాధి కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు అసభ్య పదజాలంతో ఒకర్నొకరు దూషించుకున్నారు. చుట్టుపక్కల ప్రభుత్వ కార్యాలయాలున్నాయనే విషయాన్ని విస్మరించి వీరు రెచ్చిపోయారు. అక్కడే ఉన్న ఏపీఓ బ్రహ్మయ్య నచ్చజెప్పేందుకు యత్నించినా, వీరు తగ్గలేదు. ఓ పనికి సంబంధించి ఈసీ హజరత్తయ్య, సాంకేతిక సహాయకుడు సునీల్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కనే ఉన్న వెలుగు కార్యాలయంలోని మహిళలు అవాక్కయ్యారు. కాగా ఈ కార్యాలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఉద్యోగులు, సిబ్బంది తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ విషయమై ఉదయగిరి ఏపీడీ మృదులను సంప్రదించగా, విచారణ జరిపి చర్యలు చేపడతామని బదులిచ్చారు.
నాలుగో రోజూ పెన్‌డౌన్
నెల్లూరు సిటీ: నగరంలోని డాక్యుమెంట్ రైటర్లు నాలుగో రోజు గురువారం పెన్‌డౌన్ చేపట్టి నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలను ధరించి కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు శుక్ర, శనివారాల్లో పెన్‌డౌన్‌ను నిర్వహించనున్నారని దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు పట్నం దుర్గేష్‌బాబు తెలిపారు.