
హెచ్‌ఐవీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
నెల్లూరు(అర్బన్): హెచ్‌ఐవీ / ఎయిడ్స్ రహిత జిల్లాగా నెల్లూరును మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ సుజాత కోరారు. హెచ్‌ఐవీ, సుఖవ్యాధులు, మాదకద్రవ్యాల నివారణపై ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార రథం నగరానికి గురువారం సాయంత్రం చేరుకుంది. దీన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. హెచ్‌ఐవీ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రచార రథం ద్వారా అవగాహన కల్పించనున్నామని వివరించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే హెచ్‌ఐవీ తీవ్రత ఇక్కడ తక్కువగా ఉందని, అయితే కొత్త కేసులు రాకుండా యువతను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్యులు సైతం అవగాహన పెంచుకునేలా కళారూపాలను ప్రదర్శించనున్నారని వెల్లడించారు. జిల్లా ఎయిడ్స్ నివారణాధికారి ఖాదర్‌వలీ తదితరులు పాల్గొన్నారు.