
● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
రహదారులు రక్తసిక్తమయ్యాయి. జిల్లాలోని వివిధ మండలాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
ట్రాక్టర్‌ను ఢీకొని..
సంగం: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను మోపెడ్ వెనుక నుంచి ఢీకొని వ్యక్తి మృత్యువాతపడిన ఘటన మండలంలోని సిద్ధీపురం వద్ద నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కొండాపురం మండలం వెలిగాండ్ల గ్రామానికి చెందిన దార్ల వెంకటేశ్వర్లు (50) పౌరోహిత్యం చేస్తుంటాడు. రెండురోజుల క్రితం ఆత్మకూరు మండలం నారంపేట గ్రామంలో జరిగిన కార్యక్రమానికి వచ్చాడు. గురువారం బంధువులను చూసేందుకు నారాయణరెడ్డిపేటకు మోపెడ్‌పై బయలుదేరాడు. సిద్ధీపురం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీకొట్టాడు. దీంతో తలకు గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సంగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రాజేష్ బాధిత కుటుంబానికి సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేశారు.
మోపెడ్ అదుపుతప్పి..
దుత్తలూరు: మోపెడ్ అదుపుతప్పి ఒకరు మృతిచెందిన ఘటన గురువారం సాయంత్రం వెంకటంపేట మలుపు వద్ద జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మర్రిపాడు మండలం ఇసుకపల్లి గ్రామానికి చెందిన వెంకటనరసయ్య (51) ఉదయగిరిలో పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెంకటంపేట మలుపు వద్దకు వచ్చేసరికి మోపెడ్ అదుపుతప్పింది. దీంతో వెంకటనరసయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో ఎవరూ అతడిని గుర్తించలేదు. చాలాసేపటి తర్వాత అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి 108కు సమాచారమిచ్చారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి..
వింజమూరు(ఉదయగిరి): మండలంలోని ఊటుకూరు పంచాయతీ ఇందిరానగర్ సమీపంలో గురువారం సాయంత్రం ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి బద్వేల్‌కు చెందిన డ్రైవర్ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కావలి – దుత్తలూరు మధ్య కొన్నినెలల నుంచి 167 బీజీ రహదారి పనులు జరుగుతున్నాయి. యంత్రాలకు ఆయిల్ సరఫరా చేసే నిమిత్తం డ్రైవర్ నవీన్ (24) కాంట్రాక్టర్ సంస్థకు చెందిన ట్యాంకర్‌తో బద్వేల్ నుంచి వింజమూరు వైపు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇందిరానగర్ సమీపంలో ఉన్న కల్వర్టును ట్యాంకర్ ఢీకొట్టి రోడ్డు కింద వైపునకు జరిగి బోల్తా పడగా నవీన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలాన్ని సీఐ వెంకటనారాయణ, ఎస్సై వీరప్రతాప్ పరిశీలించారు. కేసు నమోదు చేశారు.