
మృతదేహాలతో నెల్లూరులో రోడ్డుపై బైఠాయింపు
భారీగా పోలీసు బలగాల మోహరింపుతో ఉద్రిక్తత
స్తంభించిన ట్రాఫిక్
అధికారులను నిలదీసిన మృతుడి కుమార్తె
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నెల్లూరులోని ముత్తుకూరు గేట్ సెంటర్ వద్ద ఇద్దరి మృతదేహాలతో కుటుంబ సభ్యులు గురువారం నిరసన చేపట్టారు. పెరమన వద్ద కారును ఇసుక టిప్పర్ అతివేగంగా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇందుకూరుపేటకు చెందిన వారితోపాటు నెల్లూరులోని 16వ డివిజన్ గుర్రాలమడుగు సంగానికి చెందిన శేషం చినబాలవెంగయ్య, సారమ్మ ఉన్నారు.
ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ప్రభుత్వం పరిహారం ప్రకటించకపోవడంతో నగరానికి చెందిన ఇద్దరి మృతదేహాలతో వారి కుటుంబసభ్యులు ముత్తుకూరు గేట్ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు అంత్యక్రియలు చేసేది లేదని భీషి్మంచారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సీపీఎం నగర శాఖ కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, మృతిచెందిన వారంతా నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన వారని చెప్పారు.
ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి మృతుల కుటుంబాలకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని మండిపడ్డారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం డబ్బుల్లేవన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మృతుల కుటుంబాలను పరామర్శించే తీరిక లేకుండా పోయిందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రూ.5 లక్షలతో సరిపెట్టిన ప్రభుత్వం
రోడ్డుపై మృతదేహాలతో నిరసన విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు జిల్లా అధికారులు సమాచారమిచ్చారు. దీంతో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. ఇదే విషయాన్ని నెల్లూరు అర్బన్ తహసీల్దార్ వచ్చి మృతుల కుటుంబాలకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన మృతుడు చినబాలగంగయ్య కుమార్తె ఎనిమిదేళ్ల అశ్విని తహసీల్దార్‌ను, పోలీసు అధికారులను నిలదీసింది.
ఉదయం నుంచి తన తండ్రి మృతదేహాన్ని ఎండలో పెట్టుకొని బాధపడుతుంటే ఇప్పటివరకు ఏం చేస్తున్నారని అశ్విని ప్రశ్నించింది. తన తండ్రి బతికున్న సమయంలో తమ కోసం కష్టపడి ఎండలో పనిచేసేవారని, మరణించాక కూడా మృతదేహాన్ని ఎండలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో తమ చదువులు, భవిష్యత్తు బాగుపడతాయా? అని నిలదీసింది.
కారు నంబర్‌తో టిప్పర్‌కు టింకరింగ్.. ఇది పోలీసుల కవరింగ్
» నెల్లూరు జిల్లా టిప్పర్ ప్రమాద ఘటనలో దోషుల్ని తప్పించేందుకు యత్నం
» ఏడుగుర్ని బలిగొన్న టీడీపీ నేత ఇసుక టిప్పర్.. ప్రమాదానికి గురైన కారు నంబర్‌ను టిప్పర్ నంబర్‌గా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్
» టిప్పర్ డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన ఎస్పీ.. పరారయ్యారంటున్న పోలీసులు.. మంత్రి ‘ఆనం’ అనుచరులకు పోలీసులు వత్తాసు
సంగం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన సమీపంలో జాతీయ రహదారిపై టీడీపీ నేతకు చెందిన ఇసుక టిప్పర్ బుధవారం రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చి కారును ఢీకొట్టి ఏడుగురిని బలిగొన్న ఘటనలో పోలీసుల తీరు విస్తుగొలుపుతోంది. ఈ కేçసును తారుమారు చేసేందుకు యతి్నస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టిప్పర్ డ్రైవర్ సంగం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం అర్ధరాత్రి లొంగిపోయాడని జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ప్రకటించారు.
అయితే.. తెల్లవారేసరికి అదే టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని సంగం పోలీసులు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను నిబంధనల ప్రకారం తక్షణమే వైద్య పరీక్షలకు పంపించాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలకు పంపితే టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే విషయం బయటపడుతుందనే భయంతో పోలీసులపై మంత్రి ఆనంరామనారాయణరెడ్డి అనుచరులు ఒత్తిడి తెచ్చి డ్రైవర్ అరెస్ట్ కాలేదంటూ నాటకమాడిస్తున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు.

తప్పుల తడకగా ఎఫ్‌ఐఆర్
ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను సైతం పోలీసులు సక్రమంగా రాయకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లో ఏ–1గా టిప్పర్ డ్రైవర్‌ను చూపించారు. ఇసుక టిప్పర్ నంబర్‌ను ఏపీ 40 హెచ్‌జీ 0758గా నమోదు చేశారు. నిజానికి ఈ నంబర్ టిప్పర్‌ది కాదు. ప్రమాదానికి గురైన కారుది. అంటే కారు నంబర్‌ను టిప్పర్ నంబర్‌గా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఏ–2గా టిప్పర్ యజమాని అని రాసి, అక్కడా టిప్పర్ నంబర్‌కు బదులుగా కారు నంబర్‌నే రాశారు.
టిప్పర్ నంబర్ ఏపీ 39 డబ్యూహెచ్ 1695 కాగా.. ఈ నంబర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా చూపకపోవడం గమనార్హం. కాగా, మృతుల్లో ఒకరైన తాళ్లూరు శ్రీనివాసులు సోదరుడు సాయిచైతన్య ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్, యజమాని, ఇసుక అక్రమ రవాణాదారు బుజ్జయ్యనాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.