
నవోదయ ప్రిన్సిపల్ కిరాతకం
మర్రిపాడు: మండలంలోని కృష్ణాపురంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ పెత్తన స్వామి కిరాతకం బయటపడింది. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపల్ తాజాగా 6వ తరగతి విద్యార్థి పరకాయల మహేష్‌బాబుని విచక్షణా రహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం రాత్రి జరిగింది. విద్యార్థిని రక్తం కారేలా కొట్టి, బాత్‌రూమ్‌లో నిర్బంధించిన దారుణం సంచలనం సృష్టించింది. మహేశ్‌ను వాష్ రూమ్‌లోకి తీసుకెళ్లి తలను గోడకేసి కొట్టడంతో తీవ్ర గాయమై రక్తం కారింది. అయినా కనికరించని ప్రిన్సిపల్, వాష్‌రూమ్‌లో పెట్టి బయట నుంచి గడియ పెట్టారు. బాధతో కేకలు వేస్తున్నా.. తలుపులు తెరవొద్దని ఉపాధ్యాయులను హెచ్చరించారు. మహేశ్ ఆర్తనాదాలతో చలించిపోయిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు వెంటనే వాష్‌రూమ్ తలుపులు తెరిచి రక్తస్రావమవుతున్న విద్యార్థిని కారులో మర్రిపాడు పీహెచ్‌సీకి తరలించారు. పాఠశాలలో ఇలాంటి దారుణం జరగడంపై విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రిన్సిపల్ సస్పెన్షన్
మహేష్‌బాబు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మర్రిపాడు పోలీసులు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్ దాష్టీకంపై సంబంధిత అధికారులు స్పందించారు. విద్యార్థిపై కర్కశంగా దాడికి పాల్పడిన ప్రిన్సిపల్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
ప్రిన్సిపల్ రౌడీలాగా వ్యవహరించారు
నవోదయ పాఠశాలలో విద్యార్థిపైన కర్కశంగా ప్రవర్తించిన ఇన్‌చార్జి ప్రిన్సిపల్ రౌడీలాగా దాడి చేయడం ఏమిటని ఆంధ్ర విద్యార్థి సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మహంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రిన్సిపల్ తీరు గర్హనీయమని, ఆయపై కఠిన చర్యలు తీసుకోవాలని మరో విద్యార్థిని తండ్రి చండ్ర నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నవోదయ యాజమాన్యంతోపాటు పోలీసులు కఠినంగా వ్యవహరించాలని దొడ్డవరపు విజయమోహన్‌రావు పేర్కొన్నారు.
రక్తం కారేలా విద్యార్థిని కొట్టి, ఆపై
బాత్‌రూమ్‌లో నిర్బంధం
తలుపులు తెరవొద్దని టీచర్లకు హెచ్చరిక
ఆర్తనాదాలతో చలించి ఆస్పత్రికి
తరలించిన ఉపాధ్యాయులు
తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసుల
కేసు నమోదు
తీవ్రంగా స్పందించిన తల్లిదండ్రులు
ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్ వేటు