
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
కోవూరు: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. కార్పెంటర్‌గా పనిచేసే చిన్నపడుగుపాడుకు చెందిన అలీం (38) మద్యానికి బానిసయ్యారు. సంపాదించిన మొత్తాన్ని దీనికే వెచ్చించసాగారు. అనారోగ్య సమస్యలూ వెంటాడటంతో గతంలో పలుమార్లు ఆత్మహత్యయత్నాలకు పాల్పడ్డారు. ఈ తరుణంలో భార్య అస్మత్, ఇద్దరు కుమారులను తీసుకొని శనివారం రాత్రి బయటకెళ్లారు. తిరిగొచ్చేసరికి ఫ్యాన్ హుక్‌కు లుంగీతో ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆయన్ను భార్య, పిల్లలు కిందికి దింపి 108లో కోవూరు పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. మద్యం అలవాటు, అనారోగ్యం, కుటుంబసమస్యలతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఘటనపై కోవూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.