
ఆటో కార్మికులను రోడ్డున పడేశారు
దుత్తలూరు: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సీ్త్ర శక్తి పథకంతో రాష్ట్రంలోని 15 లక్షల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. దుత్తలూరు లోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సీఐటీయూ నాలుగో మండల మహాసభలో ఆయన మాట్లాడారు. ఆటో, విద్యుత్, మినీ అంగన్‌వాడీ కేంద్రాల కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రవాణా రంగంలో నష్టపోయిన కార్మికులకు ఏటా రూ.25 వేల చొప్పున అందించాలని కోరారు. కార్మికుల సమస్యలపై ఈ నెల 18న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీని నిర్వహించారు. సీఐటీయూ నేతలు హజరత్తయ్య, సురేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.