
చికెన్ ధరలు జూమ్
● బ్రాయిలర్ కిలో రూ.260
● ఫారం కోడి మాంసం రూ.200
● కోళ్లు తగ్గిపోవడమే పెరుగుదలకు కారణం
● గ్రామాల్లో రూ.20 అదనం
పొదలకూరు: చికెన్ ధరలు తగ్గి వ్యాపారులు, కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు కుదేలవుతున్న తరుణంలో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. బర్డ్ ఫ్లూ, ఇతర అంటువ్యాధులతో కోళ్ల పరిశ్రమ కునారిల్లుతుండగా, ప్రస్తుతం ఊపిరి పోసుకుంటోందని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. బ్రాయిలర్, ఫారం కోళ్ల ధరలు కిలోకు రూ.40 పెరగడంతో మాంసం ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. పొదలకూరు చుట్టుపక్కల మండలాల్లో ఈ పరిశ్రమలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. పెద్ద వ్యాపారాల్లో కోళ్ల అమ్మకాలు ఒకటి కావడంతో మాంసం దుకాణాలు ఆదివారం కిటకిటలాడుతుంటాయి. మండలంలోని మొగళ్లూరు, చాటగొట్ల తదితర గ్రామాల్లో కోళ్ల పెంపకాన్ని స్వల్పంగా చేపట్టి పట్టణంలో విక్రయిస్తున్నారు.
ఒక్కసారిగా..
చికెన్ ధరలు ఉన్నఫళంగా పెరిగాయి. చిత్తూరు తదితర ప్రాంతాల్లో కోళ్ల సంఖ్య తగ్గిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని వ్యాపారులు తెలిపారు. మొగళ్లూరులో కోళ్ల ఫారం ఉన్న యజమాని ఇటీవల వరకు నష్టాలను చవిచూసి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత వారం కిలో బ్రాయిలర్ ధర రూ.210 నుంచి రూ.220 ఉండగా, ఈ ఆదివారానికి రూ.260కు చేరుకుంది. ఫారం కోడి మాంసం రూ.180 ఉండగా, ఇప్పుడు రూ.200 పలుకుతోంది.
ధరలు చూసి విస్తుపోతూ..
చేపల ధరలు బాగా పెరుగుతున్నాయని చికెన్ తింటున్న మాంసాహార ప్రియులు పెరిగిన రేట్లను చూసి విస్తుపోతున్నారు. గ్రామాల్లో కిలోపై రూ.20ను అదనంగా వసూలు చేస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ కాటాలున్నా, తూకాల్లో తేడాలొస్తున్నాయి. గతంలో లీగల్ మెట్రాలజీ శాఖ వారు చికెన్ దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు సైతం నమోదు చేశారు. ఎలక్ట్రికల్ కాటాలను స్వాధీనం చేసుకున్నారు. తరచూ దాడులు నిర్వహిస్తే తూకాల్లో తేడాలు రావని వినియోగదారులు పేర్కొంటున్నారు.
ధరలు బాగా పెరిగాయి
చికెన్ ధరలు బాగా పెరిగాయి. గత వారంతో పోలిస్తే భారీ వ్యత్యాసం కనిపించింది. కోళ్ల సంఖ్య తగ్గిపోవడం సైతం పెరుగుదలకో కారణం. బయటి జిల్లాల నుంచి కోళ్లు ఆశించిన స్థాయిలో దిగుమతి కావడం లేదు. చుట్టుపక్కల గ్రామాల్లో కోళ్ల పరిశ్రమ లేకపోవడం సైతం ఓ కారణం.
– నారాయణరెడ్డి, వ్యాపారి, పొదలకూరు

చికెన్ ధరలు జూమ్