
కబడ్డీ జట్టు ఎంపికలు నేడు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా బాలుర, బాలికల జూనియర్ కబడ్డీ జట్టు ఎంపికలను సోమ వారం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి గంటా సతీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీ జరగాల్సిన ఈ ఎంపికలను వర్షాల కారణంగా వాయిదా వేశామని తెలిపారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికై న వారు ఈ నెల 22వ తేదీ నుంచి ఎన్‌టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరిగే 51వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని వివరించారు. ఇతర వివరాలకు 7278555777 నంబరులో సంప్రదించాలని కోరారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో కృష్ణతేజ అతిథిగృహం వరకు భక్తులు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 82,149 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 36,149 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.85 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
పెన్నకు వరద విడుదల
● గంగమ్మకు సారే సమర్పించిన ఆనం
సోమశిల: జలాశయం నుంచి 5, 6 గేట్ల ద్వారా ఆదివారం మంత్రి ఆనం పెన్నానదికి నీటిని విడుదల చేసి గంగమ్మకు జలహారతి ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ వరద జలాలు రావడంతో జలాశయం సామర్థ్యం వరకు నీటిని నిల్వ చేసి, మిగులు జలాలను పెన్నానదికి వదలం జరుగుతుందన్నారు. టెంపుల్ టూరిజం పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆనం చెప్పారు. సోమశిల నుంచి ఏసీఆర్ కెనాల్ ద్వారా మర్రిపాడు, వింజమూరు దుత్తలూరుకు నీటిని అందజేసే పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని అన్ని గిరిజన గురుకుల పాఠశాలలను సందర్శించి మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆత్మకూరు గురుకుల పాఠశాలలో ప్రబలిన జ్వరాలను దృష్టిలో ఉంచుకొని వైద్య, ఆరోగ్య, రెవెన్యూ సమన్వయంగా పనిచేస్తూ విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలో శానిటేషన్ చేయించాలని సూచించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సోమేశ్వరాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవచౌదరి, సోమశిల ప్రాజెక్ట్ ఎస్‌ఈ వెంకటరమణారెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి పావని, డీఎస్పీ వేణుగోపాల్ పాల్గొన్నారు.