
కలెక్టర్లుగా దంపతులకు గౌరవం
నెల్లూరు, పల్నాడు కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరిస్తున్న హిమాన్షు శుక్లా, కృతికా శుక్లా (ఫైల్)
● ఒకే రోజు నెల్లూరులో భర్త,
పల్నాడులో భార్య బాధ్యతల స్వీకారం
నెల్లూరు (అర్బన్): ఐఏఎస్ సాధించడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువ మంది విఫలమవుతారు. అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు. ఐఏఎస్‌కు సెలక్ట్ అయిన వారు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించే అవకాశం దక్కడం, పని చేయడం గొప్ప గౌరవం. అయితే ఐఏఎస్ సాధించి వివిధ హోదాల్లో పనిచేసిన ఇద్దరు భార్యాభర్తలు ఒకే రోజు చెరొక జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగాని, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కానీ ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు. భార్యాభర్తలు ఇద్దరూ ఐఏఎస్‌లుగా ఎంపికై నప్పటికీ ఇద్దరూ ఒకే రోజు కలెక్టర్లుగా నియమితులు కాలేదు. కానీ ఒకే రోజు ఇద్దరు భార్యాభర్తలు రెండు జిల్లాలకు కలెక్టర్లుగా శనివారం బాధ్యతలు స్వీకరించిన అరుదైన గౌరవం నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఆయన భార్య పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లాలకు దక్కింది. ఒకరు తొలి ప్రయత్నంలో.. మరొకరు రెండో ప్రయత్నంలో ఐఎఎస్ సాధించారు. ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు.. మరొకరు హరియాణకు చెందిన వారు కావడం విశేషం. 2013లో ఐఏఎస్ సాధించిన వారిద్దరూ రాష్ట్రంలో సబ్‌కలెక్టర్లుగా, జేసీలుగా, హెచ్‌ఓడీలుగా, ఇతర శాఖల అధిపతులుగా పని చేశారు. ఐఏఎస్ ప్రిపరేషన్ సమయంలో ఇద్దరూ ఇష్టపడి.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. రాజకీయంగా సున్నితమైన నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక్కడ పనిచేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. అయితే వివిధ హోదాల్లో పని చేసి మంచి పేరు తెచ్చుకున్న హిమాన్షు శుక్లా జిల్లా కలెక్టర్‌గా తన పాలన తీరుతో ప్రజాభిమానాన్ని చూరగొంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న పల్నాడు జిల్లాలో కలెక్టర్‌గా కృతికా శుక్లాకు ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొని నిలబడతారో లేదో వేచి చూడాల్సి ఉంటుంది.

కలెక్టర్లుగా దంపతులకు గౌరవం