
ప్రకృతి సంపదను దోచుకోవడమే పని
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
చిల్లకూరు: అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రకృతి సంపదను దోచుకోవడమే పనిగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. అక్రమ కేసుల్లో చిక్కుకుని విడుదలైన చిల్లకూరు మండలం మోమిడికి చెందిన వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి, ఆయన తల్లి శారదమ్మను కాకాణి ఆదివారం పరామర్శించారు. కాకాణి విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా ఉండే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రోజూ ఎక్కడో ఒక చోట హత్యలు, దాడులు, గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి గతంలో సిలికాలో దోపిడీ జరిగిపోతోందని గగ్గోలు పెట్టారని, ఇప్పుడు ఆయన కోట మండలం కర్లపూడిలో సిలికా మైన్‌లు తీసుకునేందుకు వస్తున్నారన్నారు. దీనిని అడ్డుపెట్టుకుని పక్కనే ఉన్న ఏపీఐఐసీ భూముల్లోని సిలికాను తవ్వి తరలించి దోచుకునేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో గ్రావెల్, మట్టి, సిలికా, ఇసుక దోపిడీకి పరాకాష్టగా మారిందన్నారు. నేరుగా ప్రజా ప్రతినిధులే రంగంలోకి దిగి, వారే అక్రమంగా అనుమతులు లేకుండా గ్రావెల్, ఇసుక లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. దీన్ని స్థానికంగా ఉండే వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై అక్రమంగా కేసులు బనాయించి భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మందిపై రౌడీ షీట్‌లు ఓపెన్ చేస్తున్నారన్నారు. ఒక వేళ ఎవరిపైనా అయినా రౌడీషీట్‌లు ఓపెన్ చేస్తే తన వద్దకు గానీ, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల దృష్టికి గానీ తీసుకొస్తే, వారి పక్షాన నిలబడి పోరాడుతామని చెప్పారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేసేందుకు కూడా తాము వెనుకాడబోమన్నారు. తిరుపతి జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ సుబ్బారాయుడు పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టి, అక్రమ కేసులు బనాయించకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో నెల్లూరు సిటీ ఇన్‌చార్జి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కోవూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.