
ఉత్సాహంగా క్రీడా పోటీలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పంచాయతీరాజ్ ఇంజినీర్లు, ఉద్యోగులకు ఆటల పోటీలను ఉత్సాహంగా శనివారం నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, రింగ్‌బాల్, పరుగు పందెం పోటీలు హోరాహోరీగా సాగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కోటేశ్వరరావు మాట్లాడారు. నిత్యం పని ఒత్తిడిలో సతమతమయ్యే ఉద్యోగులకు ఆటలతో ఉపశమనం లభిస్తుందని వివరించారు. ఇంజినీర్స్ డేను పురస్కరించుకొని నగరంలోని జెడ్పీ కార్యాలయంలో ఈ నెల 15న నిర్వహించనున్న కార్యక్రమంలో విజేతలకు బహుమతులను అందజేయనున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజినీర్ల సంఘ జేఏసీ చైర్మన్ బాబూరావు, జనరల్ సెక్రటరీ ఖాదర్‌మస్తాన్, ఇంజినీర్లు సత్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, నెల్లూరు డివిజన్‌కు చెందిన సుబ్బరాజు, రమణయ్య, సుమన, పీఆర్ డిప్లొమా ఇంజినీర్ల సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రియాజ్ అహ్మద్, సుధాకర్‌రావు, రఫీ తదితరులు పాల్గొన్నారు.