
శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
● ఎస్పీ అజిత వేజెండ్ల
● నూతన ఎస్పీగా బాధ్యతల స్వీకరణ
నెల్లూరు (క్రైమ్): ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తూ వారికి మెరుగైన శాంతిభద్రతలు అందిస్తానని జిల్లా నూతన ఎస్పీ అజిత వేజెండ్ల చెప్పారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, ఎప్పుడైనా నిర్భయంగా తనను కలవొచ్చని చెప్పారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అజిత మాట్లాడుతూ నేరాల నిర్మూలన, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు వేగంగా న్యాయం అందించే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మహిళల భద్రత, రక్షణకు అధిక ప్రాధాన్యత నిస్తామన్నారు. శక్తి యాప్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామని, యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయాల్లో సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే తక్షణమే ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజాజీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, నేరచరిత కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈగల్ బృందాన్ని సమన్వయం చేసుకుంటూ మత్తు, మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేస్తామన్నారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి పోలీసుశాఖపై విశ్వాసాన్ని పెంపొందిస్తామన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి తనవంతు కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని వర్గాల సహకారం ఎంతో అవసరమన్నారు. తొలుత ఆమె సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, పోలీసు అధికారుల సంఘ నాయకులు, మినిస్టీరియల్ సిబ్బందికి ఆమెకు పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పరిస్థితులపై ఆమె డీఎస్పీల నుంచి వివరాలు సేకరించారు.

శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి