
మా మొర ఆలకించండి సారూ..
● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● పోటెత్తిన అర్జీదారులు
నెల్లూరు రూరల్: మా సమస్యలు ఆలకించి పరిష్కరించండి సారూ అంటూ పలువురు వేడుకున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జేసీ కార్తీక్, డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, డ్వామా పీడీ గంగాభవాని, డీపీఓ శ్రీధర్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
దారి లేకుండా చేస్తున్నారు
కక్షగట్టి స్థలానికి వెళ్లేందుకు దారి లేకుండా చేసేందుకు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు మండలం రామస్వామిపల్లెకు చెందిన ఎరగ్రుంట నాగభూషణమ్మ జేసీకి విన్నవించారు. ఆమె మాట్లాడుతూ మా కుటుంబానికి గ్రామంలోని సర్వే నంబర్ 337లో 0.09 సెంట్ల నివాస స్థలం ఉందన్నారు. దానిని ముగ్గురు సోదరులు సమాన భాగాలుగా పంచుకున్నారని చెప్పారు. 0.08 సెంట్ల భూమికి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకున్నట్లు చెప్పారు. మా స్థలం ముందు భాగంలో డొంక పోరంబోకు భూమిలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ నీళ్ల ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారన్నారు. పక్కన ప్రభుత్వం స్థలం ఉన్నా రాజకీయ కక్షతో తమకు దారి లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. గ్రామ పంచాయతీ సెక్రటర్, వీఆర్వో, సర్వేయర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ కలిసి ఏకపక్షంగా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే స్థలం అప్పజెప్పారన్నారు. ట్యాంక్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వ భూమి ఉన్నా.. కావాలనే మా స్థలానికి అడ్డుగా ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్, ఆర్డీఓను కలిసినా ప్రయోజనం లేదన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను సంప్రదిస్తే మాకు స్థలం పంచాయతీ చూపిస్తుందని, అక్కడే నిర్మాణం చేపడతామని తెలిపారన్నారు. న్యాయం చేయాలని కోరారు.
కళాశాలలపై చర్యలు
తీసుకోవాలంటూ..
రెండో శనివారం, ఆదివారం కళాశాలలు నిర్వహిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర ఆధ్వర్యంలో నేతలు వినతిపత్రం సమర్పించారు. జిల్లా కమిటీ సభ్యులు విష్ణు, అమర్, నాయకులు సుమంత్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలు పెట్టాలి
రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు అందజేశారు. వారు మాట్లాడుతూ కేంద్రాలు లేకపోవడంతో రోజురోజుకూ ధాన్యం ధరలు తగ్గిస్తున్నారని చెప్పారు. ఎంటీయూ 1010 రకం 920 కిలోలు రూ.13 వేలకు, కేఎన్‌ఎం 1638 రకం 920 కేజీలు రూ.16 వేలకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో డీలర్లు, వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారన్నారు.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు..
ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయడంతోపాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ కోరింది. నేతలు మాట్లాడుతూ యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారన్నారు. దీనిపై స్పందించాలన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎం.మురళి, వై.పెంచలయ్య, టి.సాంబయ్య, సీహెచ్ ఉష, సీహెచ్ తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమి ఆక్రమణపై..
రాపూరు మండలం రాపూరు గ్రామ పంచాయతీ మద్దెలమడుగు గూడూరు రోడ్డులో ఉన్న సర్వే నంబర్ 1080 ప్రభుత్వ భూముల్లో నిబంధనలకు వ్యతిరేకంగా లేఅవుట్లు వేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలలని ఏపీ ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండాపురం వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీహెచ్‌ఎఫ్‌ఎస్ ఆర్టీఓ పట్టా భూముల్ని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు కబ్జా చేసి లేఅవుట్లు వేశారన్నారు.
రైతు సమస్యల్ని పరిష్కరించండి
వర్షాల వల్ల నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం అందించాలని ఆర్‌పీఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే మాబు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్నారు. అన్నదాతలను దళారులు దోచుకుంటున్నారని చెప్పారు. నేతలు పట్టపు రంగారావు, బత్తల మధుసూదన్, దుంపల సుబ్బారావు, నంబూరు గణేష్, ఉప్ప నూరు మాలకొండయ్య, తూపిలి వంశీకృష్ణ, బెల్లంకొండ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

మా మొర ఆలకించండి సారూ..

మా మొర ఆలకించండి సారూ..

మా మొర ఆలకించండి సారూ..