
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● ఎస్పీ అజిత వేజెండ్ల
నెల్లూరు(క్రైమ్): ప్రజలు అందించే ఫిర్యాదులను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ అజిత వేజెండ్ల పోలీసు అధికారులను ఆదేశించారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఆమె సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా, ఎస్‌బీ డీఎస్పీలు చెంచురామారావు, శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ, మహిళా ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, బి.శ్రీనివాసరెడ్డి, టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం ఇపిస్తానని హైదరాబాద్‌కు చెందిన నిఖిల్ అనే వ్యక్తి రూ.34.88 లక్షలు నగదు తీసుకుని మోసగించాడని అల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రొద్దుటూరుకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి రూ.3.50 లక్షలు తీసుకుని మోసగించాడని కోవూరుకు చెందిన ఓ యువకుడు వినతిపత్రమిచ్చాడు.
● పాత గొడవలను మనసులో పెట్టుకుని కోటమిట్టకు చెందిన కాలేషా, గౌస్‌బాషాలు తనపై దాడి చేశారని అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
● భర్త శివకుమార్‌తో విడాకులు తీసుకున్నా. అయినా నిత్యం తాగొచ్చి వేధింపులకు గురిచేస్తున్నాడు. గతంలో తీసుకున్న నా వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. విచారించి న్యాయం చేయాలని బుచ్చికి చెందిన ఓ మహిళ కోరారు.
● నా ఆస్తిని పిల్లలకు సమానంగా పంచా. నా జీవనోపాధి నిమిత్తం ఉంచుకున్న ఆస్తిని అమ్ముకోనివ్వకుండా, నా బాగోగులు పట్టించుకోకుండా చిన్నకుమారుడు ఇబ్బంది పెడుతున్నాడు. జీవనం కష్టతరంగా మారింది. విచారించి న్యాయం చేయాలని వేదాయపాళేనికి చెందిన ఓ వృద్ధుడు కోరాడు.
● నా భర్త అదనపుకట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తూ ఇంటి నుంచి గెంటేశాడు. కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని విడవలూరుకు చెందిన ఓ మహిళ కోరారు.